టిబెట్‎లో మరో బ్యారియర్ లేక్ బ్రేక్.. నేపాల్, చైనాలో రెస్య్కూ ఆపరేషన్స్ స్టాప్

టిబెట్‎లో మరో బ్యారియర్ లేక్ బ్రేక్.. నేపాల్, చైనాలో రెస్య్కూ ఆపరేషన్స్ స్టాప్

ఖాట్మాండు: నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి మరోసారి భయపెడుతోంది. రెండు రోజుల క్రితం సంభవించిన పెను విలయం నుంచి కోలుకోకముందే.. టిబెట్ వైపు ఉన్న ఒక బ్యారియర్ లేక్ తెగిపోయి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటితో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని.. ఇటు నేపాల్, అటు చైనా అధికారులు సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

అలాగే, సహాయక, పునరావాస చర్యలలో మోహరించిన ఉన్న భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది, సాధారణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని భద్రతా దళాలు హెచ్చరించాయి. భోటేకోశి నదిలో నీటిమట్టం కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోందని నేపాల్‌లోని రసువా జిల్లా ఉన్నతాధికారి నరేంద్ర పరియార్ తెలిపారు. 

రెండు రోజుల క్రితం చైనా-నేపాల్ సరిహద్దులోని గైరాంగ్ ప్రాంతాన్ని భారీ బురద ప్రవాహం ముంచెత్తింది. ఈ పెను ప్రమాదంలో ఇప్పటివరకు 547 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది విదేశీయులు సహా 1,400 మంది వరకు గల్లంతయ్యారు. ఈ బురద, శిథిలాలతో పాటు సరిహద్దు ప్రాంతంలో నీరు పోగై ఒక పెద్ద సరస్సు(బ్యారియర్ లేక్​) లాంటిది ఏర్పడింది. 

నీరు, బురద బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో, ఆ నీరు క్రమంగా నిండి గురువారం నాటికే చెట్లను, పొదలను ముంచెత్తింది. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని అప్పట్లోనే హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజాగా అదే సరస్సు కట్ట తెగిపోయిందని, నీరు ఉప్పొంగుతోందని నేపాల్ పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా సాగిస్తున్న సహాయక చర్యలను కూడా నిలిపివేశారు. ప్రాణభయంతో స్థానికులు పరుగులు పెడుతూ కొండెక్కి తలదాచుకుంటున్నారు.

చైనాలోనూ నిలిచిన రెస్క్యూ ఆపరేషన్స్

చైనా వైపు కూడా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. టిబెట్‌లో  నేటికీ వందలాది మంది ఆచూకీ లభించడం లేదు. శిథిలాల వల్ల ఏర్పడిన సరస్సు నీరు.. సహాయక సిబ్బంది వెళ్తున్న మార్గం వైపుగా పొర్లుతోందని వెల్లడించింది. దీంతో ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ బృందాలన్నింటినీ అక్కడే అప్రమత్తంగా ఉండి తదుపరి ఆదేశాల కోసం వేచి ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర బృందాలను అక్కడి నుంచి సుమారు కిలోమీటరు వెనక్కి రావాల్సిందిగా అధికారులు సూచించారు.