రాయదుర్గంలో ఎకరం రూ.269 కోట్లు.. టీజీఐఐసీ వేలంలో మరోసారి రికార్డ్ బ్రేక్

రాయదుర్గంలో ఎకరం రూ.269 కోట్లు.. టీజీఐఐసీ వేలంలో మరోసారి రికార్డ్ బ్రేక్
  • రాయదుర్గం ప్లాట్ 2లోని 5.38 ఎకరాలకు అర్రాస్.. రూ.1,447.22 కోట్లకు కొన్న వంశీరాం బిల్డర్స్ 
  • వారం వ్యవధిలోనే 10.63 ఎకరాలు సేల్
  • సర్కారుకు రూ.2,833.22 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: ఐటీ కారిడార్ రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కార్పొరేషన్(టీజీఐఐసీ) నిర్వహించిన తాజా భూముల వేలంలో మరోసారి కాసుల వర్షం కురిసింది. రాయదుర్గం పరిధిలోని 5.38 ఎకరాల 'ప్లాట్ పీ-2'ను వేలం వేయగా.. ఎకరాకు ఏకంగా రూ.269 కోట్ల రికార్డు ధర పలికింది. దీంతో ఈ ఒక్క ప్లాట్ నుంచే ప్రభుత్వానికి రూ.1,447.22 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. 

వంశీరాం బిల్డర్స్ వేలంలో భారీ ధర పెట్టి భూములను కొనుగోలు చేసింది. కాగా, గత వారం నిర్వహించిన ప్లాట్ పీ-1 వేలంలో ఎకరా రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు వచ్చాయి. ఎంఎస్ఎన్ రియల్టీ సంస్థ నాడు ఆ ప్లాట్ ను దక్కించుకుంది. తాజా ప్లాట్ పీ-2 అంతకుమించి ధర పలకడం విశేషం. ఇప్పటికే ప్లాట్ పీ-1కి సంబంధించి మొదటి విడతగా 25 శాతం నగదు ప్రభుత్వానికి జమ అయ్యింది. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ-వేలం ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ ఈ వేలానికి ఎక్స్‌క్లూజివ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించి, మార్కెట్ అసెస్‌మెంట్, ఇన్వెస్టర్లతో సమన్వయం చేపట్టింది. ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా టీజీఐఐసీ సాధించిన ఈ విజయం తెలంగాణ రియల్​ఎస్టేట్​ రంగానికి మరింత ఊపునిస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వారం రోజుల్లోనే రూ.2,833.22 కోట్ల రాబడి..!

కేవలం వారం రోజుల వ్యవధిలోనే టీజీఐఐసీ నిర్వహించిన రెండు భూముల వేలం ద్వారా మొత్తం 10.63 ఎకరాల స్థలానికి గాను రూ.2,833.22 కోట్ల భారీ రాబడి వచ్చింది. అంటే, సగటున ఎకరాకు దాదాపు రూ.266.53 కోట్లు లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే దాదాపు 52.3 శాతం అదనపు ప్రీమియం (ధర) లభించడం గమనార్హం. 

రాయదుర్గం కారిడార్‌లో స్థలాలకు మార్కెట్‌లో ఉన్న విపరీతమైన డిమాండ్‌ను ఈ వేలం ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయి. ఇవి హైదరాబాద్, తెలంగాణల పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న అపారమైన నమ్మకానికి అద్దం పడుతున్నాయని టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక అన్నారు. 

ప్రధాన వ్యాపార, పెట్టుబడి కేంద్రంగా రాయదుర్గం తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుందన్నారు. పారదర్శకమైన, పోటీతత్వ విధానం ద్వారా ప్రభుత్వ ఆస్తులకు సరైన విలువను రాబట్టగలిగామని, ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.