- ఆటోమొబైల్, ఏఐ, ఎలక్ట్రానిక్స్,
- రోబోటిక్స్ రంగాల్లో సంయుక్త శిక్షణ
- ఇంజినీరింగ్ విద్య, విద్యార్థుల
- పరస్పర మార్పిడి, శిక్షణపై సహకారం
- హైదరాబాద్‌కు రావాలని
- హెచ్‌ఐటీ బృందాన్ని
- ఆహ్వానించిన మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జపాన్‌లోని ప్రముఖ ‘హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (హెచ్‌ఐటీ), ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (వైఐఎస్‌యూ) మధ్య భాగస్వామ్యానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం హెచ్‌ఐటీని సందర్శించింది.
ఈ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఇంజినీరింగ్ విద్య, ఆధునిక సాంకేతిక నైపుణ్యాల బదిలీపై ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థుల మ్యూచ్‌వల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ చేపట్టనున్నారు. తెలంగాణ విద్యార్థులకు జపాన్‌లోని ల్యాబ్ బేస్ ట్రైనింగ్, అక్కడి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తున్న విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
అంతేకాకుండా అధ్యాపకుల కోసం ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ (టీఓటీ), స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు, సంయుక్త పరిశోధనలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా అడ్వాన్స్డ్ మాన్యూఫాక్చరింగ్, ఆటోమొబైల్, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని విస్తరించనున్నారు.
పరిశ్రమల అవసరాలే లక్ష్యంగా..
కేవలం సంప్రదాయ సర్టిఫికెట్ విద్యకే పరిమితం కాకుండా, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు సాంకేతిక బదిలీ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్లాస్రూమ్ ఎడ్యుకేషన్‌ను నేరుగా పరిశ్రమల సవాళ్లతో అనుసంధానించే జపాన్ అత్యుత్తమ పద్ధతులను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో అమలు చేస్తామన్నారు. హెచ్‌ఐటీ ఇంజినీరింగ్ రంగంలోని సామర్థ్యాలు.. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి విధానాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థలో ఎలా అమలు చేయవచ్చనే అంశంపై చర్చించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు వచ్చి ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని సందర్శించి.. పార్ట్‌నర్‌షిప్‌కు సంబంధించిన యాక్షన్‌ప్లాన్ రూపొందించాలని హెచ్‌ఐటీ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. అలాగే, డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2026’కు హాజరుకావాలని కోరారు. ప్రపంచస్థాయి సంస్థలతో నేరుగా సంబంధాలు నెలకొల్పి తెలంగాణ యువతను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
