- రాష్ట్ర వ్యాప్తంగా కిటకిటలాడిన బస్టాండ్లు.. కిక్కిరిసిన బస్సులు
- స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేశారని ప్రయాణికుల ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు : రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని జూబ్లీ, ఇమ్లీబన్ బస్టాండ్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా, పట్టణ కేంద్రాల్లోని బస్టాండ్లు కిటకిటలాడాయి. రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేకంగా నడిపించిన ఐదు వేల అదనపు బస్సులు కూడా మహిళా ప్రయాణికులకో కిక్కిరిసిపోయాయి.
రోజువారీ ప్రయాణాలతో పోల్చుకుంటే రాఖీ సందర్భంగా అదనంగా 65 శాతం మంది జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయడంతో ఆర్టీసీకి భారీగానే ఆదాయం సమకూరి ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉంటే రాఖీ పండుగ రోజున స్పెషల్ బస్సుల పేరుతో పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను ఖాళీ చేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ గా నడిచే బస్సులను సైతం తగ్గించి, ఆ బస్సులకే స్పెషల్ బస్సుల బోర్డులను తగిలించి నిలువు దోపిడీ చేశారని ఆరోపించారు. పండుగలు వచ్చినప్పుడల్లా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో పేద, మధ్య తరగతి ప్రయాణికులపై ఆర్థికభారం మోపుతోందన్నారు. స్పెషల్ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమలు చేయకపోవడం, అధిక ఛార్జీల వసూలుపై పలువురు మహిళలు కండక్టర్లతో గొడవకు దిగారు.
