బస్సెక్కిన పొన్నం.. రాఖీ కట్టిన మహిళలు..

బస్సెక్కిన పొన్నం.. రాఖీ కట్టిన మహిళలు..
  • పండుగ రోజు డ్యూటీ చేస్తున్న  ..
  • డ్రైవర్లు, కండక్టర్లను అభినందించిన మంత్రి
  • మహాలక్ష్మి స్కీమ్ కింద రూ.12 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణం : పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్, వెలుగు : రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల నుంచి హుస్నాబాద్ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టారు. 

మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి.. ఉచిత ప్రయాణ అనుభవాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పండుగ రోజుల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ డ్యూటీకి హాజరైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సేవలను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఇప్పటివరకు రూ.12 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు.

 పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకాలతో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. 

అనంతరం హుస్నాబాద్ లోని క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన రాఖీ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళా నాయకులు మంత్రికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు  తెలిపారు.