- ప్యాకెట్లపై హై ఫ్యాట్, హై షుగర్ ను సూచిస్తూ గుర్తులు ఉండాల్సిందే
- దశలవారీగా నిబంధనలు అమలు
న్యూఢిల్లీ: ఒబెసిటీ వంటి లైఫ్‌స్టైల్ డిసీజెస్ లపై పోరులో భాగంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సరికొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై తప్పనిసరిగా రెడ్ కలర్ లేబుల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలకు హానికరమైన పోషకాలే కారణమని సుప్రీంకోర్టుకు ఇటీవల పిటిషన్లు అందాయి.
స్పందించిన కోర్టు.. ప్యాకేజ్డ్ ఫుడ్ పై వార్నింగ్ లేబుల్స్ ఏర్పాటు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించింది. దీనికి సంబంధించిన అఫిడవిట్‌ను శుక్రవారం కోర్టుకు సమర్పించింది. ఈ ప్రపోజల్స్ ప్రకారం.. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధిక కొవ్వు, అధిక చక్కెర, హై సాల్ట్, హైలీ స్వీటెడ్ బెవరేజ్ వంటి హానికరమైన పోషకాలు మోతాదుకు మించి ఉంటే వినియోగదారులు వెంటనే గుర్తించేలా పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. లేబుళ్లను ఎర్రటి రంగు షడ్భుజి ఆకారంలో ప్యాకేజీల ముందు
భాగంలోనే స్పష్టంగా ప్రదర్శించాలని రెగ్యులేటర్ ప్రతిపాదించింది.
మినహాయింపు పదార్థాలివే..
అలాగే కొన్ని వర్గాల ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ మినహాయింపులను కూడా ప్రతిపాదించింది. సింగిల్-ఇంగ్రిడియంట్ (ఒకే పదార్ధంతో కూడిన) ఆహార ఉత్పత్తులు, నెయ్యి, వంట నూనె, బెల్లం, తేనె వంటి కొవ్వు, చక్కెర లేదా ఉప్పు సహజంగానే సమృద్ధిగా ఉండే ఆహార ఉత్పత్తులకు అవసరాలకు లోబడి మినహాయింపు ఇవ్వచ్చు.
ఈ సరికొత్త నిబంధనలను పరిశ్రమలు పాటించేందుకు, ఆహార పదార్థాల తయారీలో తగిన మార్పులు చేసుకునేందుకు వీలుగా దశలవారీగా అమలు చేయాలని సిఫారసు చేసింది. మొదటి దశలో (ఫేజ్ I) హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్ వంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు, స్వీటెడ్ పానీయాలు అధికంగా ఉన్న ఉత్పత్తులను కవర్ చేస్తారు. రెండో దశలో ఏదైనా ఒక్క పోషకం ఎక్కువగా ఉన్న వస్తువులకు కూడా ఈ రూల్ వర్తింపజేస్తారు. వినియోగదారుల ఆరోగ్యానికి ఈ కీలక మార్పులు రాబోతున్నాయి.
