- 15 శాతానికి పెరిగిన వర్షపాత లోటు
- 16 జిల్లాల్లో తిరోగమనం..
- నెర్రెలు బారుతున్న చేలు
- ముదురుతున్న ఎల్‌నినో ముప్పు
- వచ్చే రెండు వారాలూ వానలు తక్కువే.. స్పష్టం చేసిన ఐఎండీ
హైదరాబాద్, వెలుగు : ఆగస్టు నెలలో దంచికొట్టాల్సిన నైరుతి రుతుపవనాలు పూర్తిగా నీరసించిపోయాయి. ఆకాశంలో మబ్బులు పడుతున్నా చినుకు రాలడం లేదు. ఎండలు మండుతుండడం, వానలు ముఖం చాటేయడంతో రాష్ట్రంలో వర్షపాత లోటు రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర సగటు వర్షపాత లోటు 15 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపు సగం జిల్లాలు (16 జిల్లాలు) వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రాబోయే రెండు వారాలు తెలంగాణ సహా దక్షిణ భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తాజా ఔట్ లుక్‌లో వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.
16 జిల్లాల్లో వర్షాభావం..
జూన్ 1 నుంచి ఆగస్టు 28 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 551.6 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 469.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 15 శాతానికి వర్షపాత లోటు పెరిగింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షపాత లోటు 20 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
వచ్చే పది నుంచి పదిహేను రోజులు కూడా వర్షాలు లేకపోతే.. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న రాష్ట్ర వర్షపాత లోటు సెప్టెంబర్ మొదటి వారం నాటికి ఏకంగా 25 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 45 శాతం లోటు ఉండగా, వరంగల్‌లో 43, జనగామలో 40, జోగులాంబ గద్వాలలో 35, భద్రాద్రి కొత్తగూడెంలో 34, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరిలలో 33 శాతం లోటు ఉంది.
అలాగే ఖమ్మం జిల్లాలో 32 శాతం, సూర్యాపేటలో 31, మహబూబాబాద్‌లో 29, నల్గొండ, వనపర్తిలో 28, ఆదిలాబాద్ 26, నాగర్‌కర్నూల్, నారాయణపేటలో 25, హైదరాబాద్‌లో 21 శాతం చొప్పున లోటు నమోదైంది. రాష్ట్రంలో ఒక్క కామారెడ్డి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వర్షాలు సాధారణం లేదా అంత కంటే తక్కువగానే నమోదయ్యాయి.
ముదురుతున్న ‘ఎల్‌నినో’ ముప్పు..
నైరుతి రుతుపవనాలపై ‘ఎల్‌నినో’ నీలినీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, ప్రస్తుతం ‘మోడరేట్ ఎల్‌నినో’ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐఎండీ తన తాజా ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఫోర్‌కాస్ట్‌లో వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవన కాలం పూర్తయ్యే వరకు ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగుతుందని, దీని వల్ల వర్షపాతం మరింత లోటులోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
పంటలకు గండం..
జూన్, జులై నెలల్లో అరకొరగా పడ్డ వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతులకు ఆగస్టు డ్రైస్పెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎండ తీవ్రత పెరిగి నేలలో తేమ ఆవిరైపోతోంది. పొట్ట, పూత దశకు వస్తున్న పైర్లు నీరందక నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడం, చెరువుల్లో నీరు లేకపోవడంతో బోరుబావుల కింద కూడా పంటలను కాపాడుకోవడం కష్టంగా మారింది.
మరోవైపు, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో తెగుళ్ల బెడద కూడా ఎక్కువవుతోంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాబోయే రోజుల్లోనూ వానలు ఉండవన్న ఐఎండీ అంచనాతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తోంది.
