- రాతి నిర్మాణాలకు మార్కింగ్
- రూ.198 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
- వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల పనులు పూర్తి చేసేలా చర్యలు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్‌కు అడుగులు పడుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పాత ఆలయ తొలగింపునకు జూన్ 17న శృంగేరీ పీఠం శిష్యులు కలాపకర్షణ నిర్వహించారు.
రూ. 198 కోట్లతో చేపడుతున్న ఆలయ పునరుద్ధరణ పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు జులై 30న ఆలయ తొలగింపు పనులు ప్రారంభించి ఆలయ తూర్పు రాజగోపురం మినహా 10 రోజుల్లోనే పూర్తిగా తొలగించారు. ఆర్కిటెక్చర్, దేవాదాయశాఖ నిపుణుల సూచనలతో పునాది పనులకు మార్కింగ్ చేశారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి మాస్టర్ ప్లాన్ నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మాణ పనుల్లో వేగం పెంచారు.
రూ. 198 కోట్లతో బృహత్తర ప్రాజెక్టు.
కాళేశ్వర ముక్తీశ్వరాలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో రూ. 198 కోట్లు కేటాయించి స్వయంగా భూమిపూజ చేశారు. రాతి కట్టడాల నిర్మాణంలో భాగంగా సంప్రదాయాలు, ఆగమశాస్ర్తాలకు అనుగుణంగా శృంగేరి పీఠాధిపతుల సూచనలతో దేవదాయశాఖ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసింది. నిర్మాణ పునాది పనులకు మార్కింగ్ చేసి పనుల్లో వేగం పెంచారు.
12 ఫీట్ల లోతు నుంచి కాంక్రీట్ నిర్మాణం చేపట్టి రాతి కట్టడాలతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అర్కిటెక్చర్ , దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఒకేసారి 20 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరగనున్నది. ఉప ఆలయాలు, ప్రాకారాలు, చిన్న గోపురాలు, గర్భాలయం కృష్ట శిల రాయితో రమణీయంగా నిర్మాణాలు చేయనున్నారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సకల సౌకర్యాలతో త్రివేణి సంగమం ఆధ్యాత్మిక, పర్యాటకంగా మార్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అష్టతీర్థాల అభివృద్ధికి రూ.60 కోట్లు
త్రివేణి సంగమ పరివాహకం వెంట ఉన్న పురాతనమైన అష్టతీర్థాలు భక్తులకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అష్ట తీర్థాలైన జ్ఙాన, వాయస, నృసింహ, బ్రహ్మ, చిత్సుఖ, వ్యాస, హనుమ, సంగమ తీర్థాల అభివృద్ధికి రూ.60కోట్లు కేటాయించింది.
జ్ఞాన తీర్థం సరస్వతి ఆది పుష్కరాల సమయంలోనే అభివృద్ధి చేశారు. మిగతా తీర్థాలను వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిపై నిర్మితమైన తెలంగాణ, మహారాష్ట్ర బ్రిడ్జి వరకు రమణీయంగా మలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో అష్టతీర్థాల
అభివృద్ధిని పొందుపరిచారు.
పుష్కరాల నాటికి పూర్తయ్యేలా పనులు స్పీడప్
వచ్చే ఏడాది జులైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునర్మిర్మాణ పనులు పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచారు. ఆలయ కూల్చివేతలు మొదలుకొని పునాది పనుల్లో ఎక్కడ జాప్యం లేకుండా ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నిర్మాణాలు వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు గడువు విధించారు. పుష్కరాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని వసతులు, సరస్వతి ఘాట్ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర బ్రిడ్జి వరకు పుణ్యస్నానాల ఘాట్ల నిర్మాణాలు పూర్తి చేసి తీరం వెంట గార్డెనింగ్ చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరాన్ని టెంపుల్ సర్క్యూట్‌లో చేర్చింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి త్రివేణి సంగమాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది.
