- అటవీ సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం సరికొత్త ఉద్యమం
- 24 జిల్లాలు 700 గ్రామాల్లో కార్యక్రమం
- నెల రోజుల్లో 3 లక్షల చెట్లకు రాఖీలు కట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు
రాంచీ/గుమ్లా: అటవీ సంరక్షణే ధ్యేయంగా జార్ఖండ్ ప్రభుత్వం శుక్రవారం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష చెట్లకు రాఖీలు కట్టే భారీ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది. గుమ్లా జిల్లాలోని జోరాగ్ గ్రామంలో ఉన్న ఒక సాల వృక్షానికి (సల్ చెట్టు) ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) సంజీవ్ కుమార్ రాఖీ కట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చెట్ల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఉన్న 700 గ్రామాల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు కలిసి లక్ష చెట్లకు రాఖీలు కడతారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో మొత్తంగా 3 లక్షల చెట్లకు రాఖీలు కట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తెలిపారు.
రక్షాబంధన్ అనేది తోబుట్టువుల మధ్య నమ్మకం, విడదీయరాని బంధానికి ప్రతీక అని, ప్రకృతితో కూడా మనకు అలాంటి బంధమే ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని, ప్రజలను ప్రకృతితో భావోద్వేగపరంగా అనుసంధానం చేయడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
కాగా, సంజీవ్ కుమార్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వినూత్న కార్యక్రమం తొలిసారిగా 2004లో ప్రారంభమైంది. అప్పట్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ధన్‌బాద్ జిల్లా టుండి బ్లాక్‌లోని లుకైయా గ్రామంలో దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12,000 పైగా గ్రామాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాయి.
