బెంగళూరు: మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న రూ.89 కోట్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రణాళిక- గణాంకాల శాఖ మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో రాజీనామాను ప్రకటిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవడం ఇది రెండోసారి.
గతంలో సిద్ధరామయ్య కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర.. 2024 మేలో కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన నిధుల అక్రమ బదిలీల కేసులో 2024 జూన్‌లో తొలిసారి రాజీనామా చేశారు. ఆ తర్వాత డీకే శివకుమార్ సీఎంగా పగ్గాలు చేపట్టాక, ఆగస్టు 3న నాగేంద్ర తిరిగి కేబినెట్‌లోకి వచ్చారు. ఆయన రీ-ఇండక్షన్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో నాగేంద్ర రాజీనామా చేశారు.
