- ఐఏఎస్‌లకు డైరెక్టు పోస్టింగులతో చిక్కులు
- రెవెన్యూ చట్టాలు, ఫీల్డ్ రికార్డులపై పట్టుండట్లే
- భూభారతి కేసుల విచారణలోనూ తీవ్ర జాప్యం
- 22ఏలో భూములు ఎలా చేరుతున్నాయో తెలియట్లేదు
- కోర్టు బోను ఎక్కుతున్న పలువురు కలెక్టర్లు
- అనుభవం ఉన్నోళ్లను నియమించాలంటున్న ఎక్స్ పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూపరిపాలన వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయి రెవెన్యూ చట్టాలు, రికార్డులపై సరైన పట్టు లేకపోవడంతో పలువురు యువ ఐఏఎస్ అధికారులు జిల్లాల్లో భూ సమస్యలను పరిష్కరించలేక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల వివాదానికి దారితీసిన రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(ఏ) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో అర్హులైన రైతుల పట్టా భూములు, ప్రైవేటు ఆస్తులు ఎలా చేరుతున్నాయో కూడా గుర్తించలేని స్థితిలో కొందరు కలెక్టర్లు ఉండటం పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతోంది.
సామాన్యుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే అంశంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక, పాత రికార్డులను శోధించలేక ఉన్నతాధికారులపై ఆధారపడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇనామ్, భూదాన్, టెనెన్సీ, యూఎల్‌సీ వంటి భూ చట్టాల లోతులు తెలియకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలకే ఆమోదముద్ర వేస్తూ మమ అనిపిస్తున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి అనుభవం లేని నిర్ణయాలతో వేలాది ఎకరాల ప్రైవేటు భూములు లాక్ అయిపోయి, భూ సమస్యలతో సామాన్య ప్రజలు ఏళ్ల తరబడి కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది.
రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22(ఏ)లోని వివిధ సబ్ కేటగిరీలపై అవగాహనలోపమే ఇప్పుడు భూ యజమానులకు శాపంగా మారింది. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్ ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తొలిసారిగా1999లో రిజిస్ట్రేషన్ల చట్టం-1908కి సవరణ చేస్తూ ‘సెక్షన్ 22(ఏ)’ను ప్రవేశపెట్టగా.. ఆ నిబంధనల్లో స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో హైకోర్టు దానిని కొట్టివేసింది. ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం 2007లో ‘యాక్ట్ నంబర్ 19/2007’ ద్వారా సమగ్ర చట్ట సవరణ తీసుకొచ్చింది.
అదే ఏడాది జూన్ 20 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ 2007 సవరణ ద్వారానే నిషేధిత భూములను 5 స్పష్టమైన ఉప-విభాగాలుగా చేసింది. అందులో భాగంగానే ఐదు నెలల కింద మార్పులు చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తాయి. వాస్తవానికి 22-ఏ(1)(ఏ) కింద ప్రభుత్వ, అసైన్డ్, పోరంబోకు, డీ-ఫామ్ పట్టా భూములుంటాయి. 22-ఏ(1)(బీ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థల స్థలాలు ఉంటాయి.
22-ఏ(1)(సీ) కేటగిరీలో దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్ బోర్డుకు చెందిన మాన్యాలు ఉంటాయి. 22-ఏ(1)(డీ) కింద భూపరిమితి చట్టం(సీలింగ్) మిగులు భూములు, భూదాన్ యజ్ఞ బోర్డు స్థలాలు, టైటిల్ వివాదాలు తేలని ఈనాం భూములు ఉంటాయి. ఇక 22-ఏ(1)(ఈ) కింద కోర్టులు అటాచ్ చేసిన ఆస్తులు, సీబీఐ, ఈడీ, అవినీతి నిరోధక శాఖల కేసుల్లో ఉన్న భూములు నమోదవుతాయి.
ఈ కేటగిరీల మధ్య ఉన్న లీగల్ వ్యత్యాసాన్ని సరిగ్గా అంచనా వేయలేక, ప్రైవేటు పట్టా భూములను యథాలాపంగా నిషేధిత జాబితాలో చేర్చేస్తున్నారు. ఏ కేటగిరీ నుంచి ఏ ఆధారాలతో భూమిని డీ-నోటిఫై చేయాలో కలెక్టర్లకు తెలియకపోవడంతో వేలాది ఎకరాల వివాదాలు ఏళ్ల తరబడి ఎటూ తేలకుండా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోతున్నాయి.
పోస్టింగ్ తీరు మారాలి..
క్షేత్రస్థాయి అవగాహన రాహిత్యం ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘భూ భారతి’ సమస్యల పరిష్కార ప్రక్రియ సజావుగా సాగడంలేదు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను క్లియర్ చేయడంలో కలెక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు భూములు 22(ఏ)లో ఎలా చేరాయో దస్త్రాలు తెప్పించి విచారించే తీరిక, నైపుణ్యం లేక దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అప్పీలేట్ అథారిటీగా వ్యవహరించాల్సిన కలెక్టర్లే స్వయంగా నిర్ణయాలు తీసుకోలేక, క్షేత్రస్థాయి తహసీల్దార్ల రిపోర్టులపైనే గుడ్డిగా ఆధారపడుతుండటంతో కిందిస్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని ఎక్స్ పర్ట్స్ విమర్శిస్తున్నారు. సరైన తీర్పులు ఇవ్వకపోవడంతో భూ బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తుండగా, న్యాయస్థానాలు కలెక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
డిజిటల్ స్క్రీన్లపై మితిమీరి ఆధారపడటం, క్షేత్రస్థాయి మూల రికార్డులైన సేత్వార్, ఖాస్రా పహాణీ, ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎంబీ టిప్పన్ల వంటి సాంకేతిక భూ పత్రాలను క్షుణ్ణంగా చదవలేకపోవడమే యువ ఐఏఎస్‌ల వైఫల్యానికి ప్రధాన కారణమని రిటైర్డ్ రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోర్టు ధిక్కార కేసులు, విజిలెన్స్ విచారణల భయంతో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కూడా చట్టబద్ధమైన విచక్షణను ఉపయోగించకుండా ఫైళ్లను తొక్కిపెట్టే ధోరణి యువ అధికారుల్లో పెరిగిపోతోందని పేర్కొంటున్నారు.
అందుకే ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులను కనీసం రెండేళ్లపాటు సబ్ కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పనిచేయించేలా సర్వీస్ నిబంధనలను కఠినతరం చేయాలంటున్నారు. భూపరిపాలనలో అపార అనుభవమున్న రిటైర్డ్ స్పెషల్ సీఎస్ స్థాయి అధికారులు, సర్వే సెటిల్మెంట్ నిపుణులతో ఐఏఎస్‌లకు కనీసం ఆరు నెలల పాటు ‘ల్యాండ్ లా మాస్టర్ క్లాసులు’ నిర్వహించాలని చెబుతున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా
గతంలో ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ విధానానికి, ప్రస్తుత సరళికి మధ్య వచ్చిన భారీ వ్యత్యాసమే ఈ పాలనా వైఫల్యానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రొబేషనరీ ఐఏఎస్‌లను తొలుత ఆర్డీవోలుగా, సబ్ కలెక్టర్లుగా నియమించి ఏండ్ల తరబడి బాధ్యతలు అప్పగించేవారు. తద్వారా వారు క్షేత్రస్థాయిలో కరణం, పట్వారీ వ్యవస్థల నుంచి నేటి గ్రామ రికార్డుల వరకు, సర్వే సెటిల్మెంట్లు, కాస్తు, పహణీ, ఆర్‌వోఆర్, ఇనాం రద్దు చట్టాలపై సమగ్ర అవగాహన పెంచుకునేవారు.
అనంతరం జాయింట్ కలెక్టర్లుగా పని చేస్తూ రెవెన్యూ కోర్టులు నడుపుతూ, క్వాషీ జ్యుడీషియల్ వివాదాలను పరిష్కరించి రాటుదేలిన తర్వాతే కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. శిక్షణ ముగియగానే నేరుగా కలెక్టర్లుగానో లేదా అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు)గానో పోస్టింగులు ఇస్తుండటంతో వీరికి సంప్రదాయ రెవెన్యూ ప్రక్రియలపై కనీస స్పష్టత కరువవుతోంది. రికార్డుల పరిశీలన రాక, చిన్న భూవివాదం వచ్చినా సీసీఎల్‌ఏ లేదా సచివాలయంలోని సీనియర్ అధికారులకు పదే పదే ఫోన్లు చేసి మార్గదర్శనం కోరాల్సిన నిస్సహాయ స్థితి ఏర్పడిందంటే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో అద్దం పడుతున్నది.
