- పాఠం వింటేనే డ్రైవింగ్ లైసెన్స్
- అప్లికెంట్లకు ఆర్టీఏ కార్యాలయాల్లో వీడియో లెస్సన్స్
- రోడ్డు భద్రతపై అవగాహన
- ట్రాక్ టెస్ట్‌లో పాసైతేనే లైసెన్స్ మంజూరు
- ప్రయోగాత్మకంగా కూకట్పల్లి ఆర్టీఏలో అమలు
- తర్వాత అన్ని జోనల్ ఆఫీసుల్లో అమలుకు నిర్ణయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఏ అధికారులు కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై పూర్తి అవగాహన కల్పించాకే లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం లైసెన్స్ దరఖాస్తుదారులకు ముందుగా వీడియో పాఠాలు బోధించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలో అనేక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మధ్యవర్తుల ప్రమేయం, కొందరు ఆఫీసర్ల అవినీతి కారణంగా డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే పర్మినెంట్ లైసెన్స్‌లు మంజూరవుతున్నట్లు గ్రహించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆయా జోనల్ కార్యాలయాల్లో లైసెన్స్ జారీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఆ నిబంధనను అమలుచేసేందుకు సిద్ధమయ్యారు. పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే మిగిలిన అన్ని జోనల్ కార్యాలయాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.
మూడు గంటల వీడియో..
సాధారణంగా డ్రైవింగ్ లైసెన్ తీసుకోవాలంటే ముందు లెర్నింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుని అక్కడ జరిగే చిన్న టెస్ట్‌లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న 30 రోజుల నుంచి 6 నెలల్లో పర్మినెంట్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. పర్మినెంట్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న వారు ఆర్టీఏ కార్యాలయంలో 3 గంటల వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ పాఠాలకు హాజరైన వారిని మాత్రమే ట్రాక్ టెస్ట్‌లకు అనుమతిస్తారు. ప్రస్తుతం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాక్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు.
ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణులైతేనే పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తారు. అంటే లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న వారు పర్మినెంట్ లైసెన్కు దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా మూడు గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిందే. ఆ తరువాతే డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
టీజీ ఆన్లైన్లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యుల్స్ ఉన్నాయి. ఆన్లైన్లో పాఠాలను వింటున్న సమయంలో అప్లికెంట్ల ముఖకవళికలు కూడా నమోదు చేస్తారు. తద్వారా వారికి ట్రాక్ టెస్ట్‌కు అనుమతిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి తప్పనిసరిగా రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ విధానం అమలులోకి తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.
