పొల్యూషన్‌‌ లెక్కల తారుమారుకు అడ్డుకట్ట.. అనలైజర్ల క్యాలిబ్రేషన్, సర్టిఫికేషన్ ట్యాంపర్‌‌‌‌ కాకుండా చర్యలకు పీసీబీ రెడీ

పొల్యూషన్‌‌ లెక్కల తారుమారుకు అడ్డుకట్ట.. అనలైజర్ల క్యాలిబ్రేషన్, సర్టిఫికేషన్ ట్యాంపర్‌‌‌‌ కాకుండా  చర్యలకు పీసీబీ రెడీ


హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌ సిటీ చుట్టుపక్కల ఉన్న కంపెనీలు కాలుష్య నియంత్రణ పరికరాలను (అనలైజర్లు) ట్యాంపర్​చేయకుండా నిరోధించడమే లక్ష్యంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీజీపీసీబీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా సనత్‌‌నగర్ బోర్డు హెడ్డాఫీసులో ఒకరోజు వర్క్‌‌షాప్‌‌ను నిర్వహించారు. 

ఈ ప్రోగ్రాంలో బోర్డు సభ్య కార్యదర్శి జి.రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల తనిఖీల సమయంలో ఆన్‌‌లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ పనితీరును అంచనా వేయడానికి, నిరంతర పొల్యూషన్ పర్యవేక్షణ వ్యవస్థల స్థితిని పరిశీలించడానికి కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆన్‌‌లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ నిపుణుడు డాక్టర్‌‌‌‌ ఎస్. సురేశ్ కుమార్ ఈ వర్క్‌‌షాప్‌‌లో వివిధ కాలుష్య నియంత్రణ పరికరాలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ పనితీరు, అనలైజర్ల క్యాలిబ్రేషన్, సర్టిఫికేషన్ ట్యాంపరింగ్ నిరోధక పద్ధతులపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. 

కాలుష్య మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధనల నుంచి తప్పించుకోవడానికి సిమెంట్, థర్మల్ పవర్ ప్లాంట్లు, ఫార్మా పరిశ్రమలు ఈ అనలైజర్లలో డేటాను మార్చడం లేదా ట్యాంపర్‌‌‌‌ చేస్తుంటాయి. ఈ అక్రమాలను అడ్డుకోవడానికి అనలైజర్ల నుంచి డేటా నేరుగా బోర్డు సర్వర్‌‌కు చేరేలా ఎండ్ -టు -ఎండ్ ఎన్‌‌క్రిప్షన్ విధానాన్ని అమలు చేయడం, పరికరాలకు ట్యాంపర్-ప్రూఫ్ సీల్స్ వేయడం, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా  ఉందని వివరించారు.