హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి మరింత గుర్తింపు తీసుకొచ్చేలా 15వ ఎడిషన్ ‘ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్–2026’ ఉత్సాహభరితంగా జరగనుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ ఎలైట్ రన్నర్ల సమావేశం శుక్రవారం హోటల్ పార్క్ హయత్‌లో జరిగింది.
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ మారథాన్‌కు ‘వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ రోడ్ రేస్’ హోదా లభించింది. ఇందులో 10 మంది అంతర్జాతీయ, 35 మంది భారతీయ రన్నర్లతో కలిపి 45 మంది ఎలైట్ రన్నర్లు పోటీపడనున్నారు.
ఈ సమావేశానికి హాజరైన సైబరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మారథాన్ రూట్‌కు 700 మంది పోలీసు సిబ్బంది, 250 మంది ట్రాఫిక్ మార్షల్స్‌తో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రెండ్రోజులు ఈవెంట్లు..
ఆగస్టు 29న హైటెక్స్ వేదికగా 5కే రన్, ఇన్‌క్లూజివ్ రన్, 30న నెక్లెస్ రోడ్–మాదాపూర్ కేంద్రంగా ఫుల్, హాఫ్, 10కే ప్రధాన మారథాన్ ఈవెంట్లు జరగనున్నాయి. మొత్తం 32 వేల మందికి పైగా రన్నర్లు పాల్గొననున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండో బహుమతిగా రూ.2.5 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు అందించనున్నారు.
కొత్త కోర్స్ లేదా జాతీయ రికార్డులు సాధించిన వారికి ప్రత్యేక బోనస్‌లు ఇవ్వనున్నారు. డోపింగ్ నియంత్రణతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ రూల్–5 ప్రకారం షూ నిబంధనలు అమలు చేయనున్నారు. ఎలైట్ రన్నర్ల కోసం రూట్‌లో 21 ఎయిడ్ స్టేషన్లు, 16 అంబులెన్సులతో వైద్య సేవలు అందుబాటులో ఉంచనున్నారు.
తొలిసారిగా 300 మందికి పైగా దివ్యాంగులతో ఇన్‌క్లూజివ్ రన్ నిర్వహిస్తున్నారు. మహిళా రన్నర్ల భద్రతకు ‘షీ రేసెస్ అక్రిడేటెడ్’ గుర్తింపు పొందడం ఈ మారథాన్ ప్రత్యేకతగా నిలవనుంది. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రన్నర్లను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.
