అన్నింటికీ ఆధారేనా..! సర్‎లో ఆధార్ కార్డునే ఏకైక పరిష్కారంగా భావిస్తోన్న బీఎల్వోలు 

అన్నింటికీ ఆధారేనా..! సర్‎లో ఆధార్ కార్డునే ఏకైక పరిష్కారంగా భావిస్తోన్న బీఎల్వోలు 
  •      వివిధ కారణాలతో ఇచ్చిన నోటీసులకు ఆధార్‌‌తోనే అప్‌డేట్ చేస్తున్న బీఎల్వోలు  
  •      ఒక్కో కారణానికి ఒక్కో ధ్రువపత్రం సేకరించాలంటున్న ఎన్నికల కమిషన్ 
  •      తగిన ధ్రువపత్రాలు ఇవ్వకుంటే ఓటు పోతుందేమోనన్న ఆందోళనలు
  •      విదేశాల్లో ఉన్నోళ్లు, దివ్యాంగులు, వృద్ధులకు వ్యక్తిగత హాజరు మినహాయింపు 

హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో నోటీసుల జారీ, వాటికి వివరణల ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. అనమాలీస్‌, అన్‌మ్యాప్డ్ కింద 92 లక్షలకు పైగా ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై అధికారులు గ్రామ సభలు, ప్రత్యేక హియరింగ్ చేపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ గుర్తించిన సాంకేతిక లోపాలు, అసంపూర్తి వివరాలపై క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్న బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వోలు) తీవ్ర అవగాహనారాహిత్యంతో వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జఠిలమవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

నిబంధనలకు విరుద్ధంగా అన్ని సమస్యలకూ ఆధార్ కార్డునే ఏకైక పరిష్కారంగా భావిస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఏ కారణంతో నోటీసు జారీచేస్తే ఆ కారణానికి నిర్దేశించిన ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అన్నింటికి ఆధార్ ఒక్కటే తీసుకోవద్దని ఈసీ తేల్చిచెప్పినా కిందిస్థాయి సిబ్బంది మాత్రం ఏ నోటీసుకైనా ఆధార్ జిరాక్స్‌ను గుడ్డిగా సేకరిస్తున్నారు. అయితే, అనమాలీస్ జాబితాలో పేర్లు నమోదైన వారికి నోటీసులు ఇచ్చేందుకు ఈసీ నిర్దిష్ట కారణాలను, వాటి నివృత్తికి అవసరమైన నిర్దిష్ట ధ్రువపత్రాలను స్పష్టంగా పేర్కొంది. 

నోటీసులోని కారణాన్ని బట్టి బర్త్ సర్టిఫికెట్, టెన్త్‌ మెమో/టీసీ, పాస్‌పోర్ట్, పాన్, బ్యాంక్, పోస్టాఫీస్ పాస్‌బుక్, రేషన్ కార్డు, కరెంట్, గ్యాస్ బిల్లు, ఇంటి పన్ను రసీదు, రిజిస్టర్డ్ అద్దె ఒప్పందం, పట్టాదార్ పాస్‌బుక్‌, తాతముత్తాతల పాత ఓటరు కార్డు, కుటుంబ రేషన్ కార్డు, తండ్రి స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షనర్ ఐడీ, ఉపాధి హామీ జాబ్ కార్డు వంటివి సమర్పించాలని వివరించింది. అయినా, అన్నింటికీ ఆధార్‌‌తోనే సరిపెడుతుండటంతో తమ ఓటు ఉంటుందా? పోతుందా? అని జనం ఆందోళన చెందుతున్నారు. 

ఈఆర్‌వోలతోపాటు కలెక్టర్లదే బాధ్యత

విచారణ ముగింపు సమయంలో సదరు ఓటరు సమక్షంలోనే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్‌వో) తప్పనిసరిగా ‘లైవ్ ఫొటో’ తీసి, నిబంధనల ప్రకారం సేకరించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎలక్షన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కిందిస్థాయి సిబ్బంది నివేదికలతో సరిపెట్టకుండా, నియోజకవర్గంలో పరిష్కరించిన ప్రతి నోటీసును జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్) స్వయంగా పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తర్వాతే రికార్డులను పునరుద్ధరిస్తారు. 

సరైన ఆధారాలు లేకుండా నోటీసులను క్లియర్ చేసినా లేదా అర్హులైన పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించినా ఈఆర్‌వోలతో పాటు కలెక్టర్లదే తుది బాధ్యత అని ఈసీఐ హెచ్చరించింది. మరోవైపు నోటీసులు వచ్చిన ఎన్నారై ఓటర్లకు వ్యక్తిగత హాజరు నుంచి పూర్తి మినహాయింపునిచ్చింది. వీరు తమ చెల్లుబాటు అయ్యే వీసా, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీలతో పాటు ఫారం-6 ఏ వివరాలను కుటుంబ సభ్యుల ద్వారా లేదా అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈఆర్‌వోకు సమర్పిస్తే సరిపోతుంది. 

అదేవిధంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు), తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులు (పీడబ్ల్యూడీ) హాజరుకావాల్సిన అవసరం లేదు. అధికారులు వారి ఇళ్ల వద్దకే వెళ్లి డాక్యుమెంట్లు పరిశీలించాలని లేదంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు వచ్చి వివరాలు ఇచ్చినా సరిపోతుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.