చాళుక్యుల పూర్వీకులు ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్నారు. వీరు కడప జిల్లాలోని ప్రాంతం హిరణ్య రాష్ట్రం పాలించారు. ఇక్ష్వాకుల అనంతరం పల్లవులతో విభేదించిన చాళుక్యులు కర్ణాటకలోని బాదామి ప్రాంతానికి వెళ్లి రాజ్యాన్ని స్థాపించారు. చాళుక్యుల రాజ చిహ్నం వరాహం. మూల పురుషుడు జయసింహుడు లేదా జయసింహవల్లభుడు.
మాన్యఖేట రాష్ట్రకూటులను జయించిన చాళుక్య వంశ మూల పరుషుడు జయసింహుడు. ఇతని తర్వాత చాళుక్య సింహాసనాన్ని రణరాగుడు అధిష్టించాడు. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి. ఇతను రణరాగుని కుమారుడు. కదంబులను ధిక్కరించి వాతాపిని ఆక్రమించి, అక్కడ బలిష్టమైన కోటను నిర్మించిన చాళుక్య రాజు మొదటి పులికేశి. మొదటి పులకేశి రాజధాని బాదామి. ఇతని శాసనం నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరం ప్రాంతంలో లభించింది.
చాళుక్య వంశీయుల్లో ప్రథమంగా మహారాజు బిరుదును ధరించింది మొదటి పులకేశి. బాదామి చాళుక్యల పాలనా కాలం క్రీ.శ.543 నుంచి 752 వరకు. మొదటి పులకేశి అనంతరం బాదామి చాళుక్య రాజు కీర్తివర్మ. కొంకణ్ ప్రాంతాన్ని ఏలిన మౌర్యులు, బనవాసి కదంబులను, బళ్లారిని ఏలిన వంశీయులను ఓడించి, కొంకణం వరకు రాజ్యాన్ని విస్తరించిన బాదామి చాళుక్య వంశ రాజు కీర్తి వర్మ.
వాతాపిని సుందరంగా తీర్చిదిద్దిన మొదటి వ్యక్తిగా చరిత్రకారులు పొగిడిన రాజు కీర్తివర్మ. ఇతని తర్వాత బాదామి చాళుక్య సింహాసనాన్ని కీర్తివర్మ తమ్ముడు మంగళేషుడు అధిష్టించాడు. మంగళేషుడి బిరుదు పరమభాగవత. క్రీ.శ.609లో మంగళేషుడిని వధించి బాదామి చాళుక్య సింహాసనాన్ని అధిష్టించింది కీర్తివర్మ రెండో కుమారుడు రెండో పులకేశి.
రెండో పులకేశి క్రీ.శ.609లో సింహాసనాన్ని అధిష్టించాడని తెలిపే శాసనం హైదరాబాద్ శాసనం (క్రీ.శ.612). రెండో పులకేశి రాకతో దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యయుగం ప్రారంభమైంది. భారత చక్రవర్తులైన మౌర్య చంద్రగుప్తుడు, గుప్త వంశ చంద్రగుప్తులతో పోల్చదగ్గ పశ్చిమ చాళుక్య వంశ రాజు రెండో పులకేశి.
మహారాష్ట్ర, మాళ్వ, కళింగ, ఆంధ్ర, కర్ణాటకలను జయించి, చాళుక్య రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మార్చిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి. హర్షుడిని ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి. హర్షునికి, రెండో పులకేశికి మధ్య నర్మదా నదీ తీరంలో క్రీ.శ. 632లో యుద్ధం జరిగింది.
పశ్చిమచాళుక్య రాజు రెండో పులకేశి హర్షుడిని ఓడించినట్లు తెలిపే శాసనం ఐహోల్ శాసనం. హర్షునితో యుద్ధం తర్వాత రెండో పులకేశి ధరించి బిరుదు పరమేశ్వర. రెండో పులకేశి రణదుర్జయులను ఓడించి వేంగిని ఆక్రమించాడు. ఈ యుద్ధంలో రెండో పులకేశి చేతిలో మరణించిన పల్లవ రాజు మహేంద్రవర్మ.
రెండో పులకేశిని ఓడించిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ. వాతాపికొండ బిరుదును ధరించిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ.
క్రీ.శ.642లో మణిమంగళ వద్ద జరిగిన యుద్ధంలో రెండో పులకేశి మరణించాడు. రెండో పులకేశి ఆస్థానాన్ని పర్షియా రాయబారి ఖుస్రూ సందర్శించాడు. రెండో పులకేశి ఆస్థానాన్ని క్రీ.శ.641లో సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్. చాళుక్య రాజ్యాన్ని పల్లవుల బారి నుంచి కాపాడిన రెండో పులకేశి కుమారుడు విక్రమాదిత్యుడు.
విక్రమాదిత్యుడు దక్షిణ గుజరాత్ లాట రాజ్యానికి రాజప్రతినిధిగా నియమించింది జయసింహవర్మ. విక్రమాదిత్యుని తర్వాత అతని కుమారుడు వినయాదిత్యుడు సింహాసనాన్ని అధిష్టించాడు. వినయాదిత్యుడు గాంగరాజు పరమేశ్వరన్తో జరిగిన విలందే యుద్ధంలో మరణించాడు. వినయాదిత్యుని తర్వాత విజయాదిత్యుడు సింహాసనాన్ని అధిష్టించాడు. సింధూ ప్రాంతంలో అరబ్బుల దాడులను ఎదుర్కొన్న పశ్చిమ చాళుక్య రాజు రెండో విక్రమాదిత్యుడు. పల్లవమల్ల అనే బిరుదు ధరించిన పల్లవరాజు రెండో నందివర్మ.
