సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై దారుణం: చెట్టుకు కట్టేసి నిప్పంటించారు.. ఆసుపత్రిలో చావుతో పోరాడి మృతి !

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై దారుణం: చెట్టుకు కట్టేసి నిప్పంటించారు.. ఆసుపత్రిలో చావుతో పోరాడి మృతి !

చండీగఢ్‌లో జరిగిన ఓ  దారుణ ఘటనలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్  28 ఏళ్ల మంజీత్ కౌర్ తీవ్ర కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. జూలై 3న అపహరణకు గురై, చెట్టుకు కట్టి నిప్పంటించడంతో ఆమె.. పీజీఐఎంఈఆర్ (PGIMER) ఆసుపత్రిలో కొన్ని వారాలుగా మృత్యువుతో పోరాడి ఆగస్టు 26న తుదిశ్వాస విడిచింది.

ఈ కేసుకు సంబంధించిన  వివరాల ప్రకారం.... ఏం జరిగిందంటే...  బాధితురాలి తల్లి కాంతా దేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  జూలై 3వ తేదీ రాత్రి శుభి, పిండా అనే ఇద్దరు పరిచయస్తులు మంజీత్‌కు ఫోన్ చేసి చండీగఢ్‌లోని సెక్టార్ 34లో ఉన్న వైన్ షాప్ దగ్గరకు రమ్మని పిలిచారు. ఆమె వెళ్లగానే నిందితులు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని పంజాబ్‌లోని మొరిండాకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై భయంకరంగా దాడి చేసి, ఒక మల్బరీ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
మంటల్లో కాలిపోతున్న మంజీత్‌ను ఒకతను గుర్తించి, దుప్పటితో మంటలు ఆర్పి మొరిండాలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ముందుగా మొహాలీకి, ఆ తర్వాత జూలై 9న చండీగఢ్‌లోని పెద్ద ఆసుపత్రి అయిన పీజీఐఎంఈఆర్‌కు మార్చారు.

కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలోనే ఉన్న మంజీత్, ఆగస్టు 5న కొద్దిసేపు స్పృహలోకి వచ్చింది. ఆ సమయంలో తనపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు కళ్లకు కట్టినట్లు వివరించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో ఆగస్టు 26న ఆమె ఆసుపత్రిలోనే కన్నుమూసింది.

పోలీసుల దర్యాప్తు, కేసు నమోదు
ఈ ఘటనపై సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌లో నిందితులపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజీత్‌కు ఇదివరకే విడాకులు అయ్యాయి, ఆమెకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. నిందితులలో ఒకరితో ఆమె సహజీవనం చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న శుభి, పిండాలను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చండీగఢ్ నుంచి మొరిండా వరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.