వాటర్ బోర్డు పనులకు జియో ట్యాగింగ్.. ఎక్కడ.. ఎవరు.. ఎలా పని చేస్తున్నారో తెలుస్తది 

వాటర్ బోర్డు పనులకు జియో ట్యాగింగ్.. ఎక్కడ.. ఎవరు.. ఎలా పని చేస్తున్నారో తెలుస్తది 
  •     ఎండీ డ్యాష్​బోర్డుకు లింక్​    నేరుగా హెడ్డాఫీసు నుంచే పర్యవేక్షించే అవకాశం

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డు చేపడుతున్న పనులన్నీ జియోటాగింగ్ చేయాలని నిర్ణయించారు. పటిష్టమైన పర్యవేక్షణ కోసం ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. క్యూర్​పరిధిలో 2050 చ. కి.మీ. విస్తీర్ణంలో వాటర్​బోర్డు నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను నిర్వహిస్తోంది. ఇక్కడ అత్యవసర, సాధార పనులు వేల సంఖ్యలో జరుగుతున్నా వాటి వివరాలు స్పష్టంగా లేవు. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లలో జవాబుదారీతనం లోపించడంతో చాలా పనులు నెలల తరబడి కొనసాగుతున్నాయి. పక్కాగా పర్యవేక్షించడం కూడా కష్టమవుతోంది. దీంతో ఈ పనులను పర్యవేక్షించేందుకు ఆన్​లైన్​మానిటర్​విధానానికి వాటర్​బోర్డు శ్రీకారం చుట్టింది. 

ప్రతి పనినీ జియోట్యాగింగ్​ 

వాటర్​బోర్డు పరిధిలో జరుగుతున్న పనులన్నింటినీ జియోట్యాగింగ్​చేయనున్నారు. ప్రతి పనికీ ఒక ఐడీ ఇవ్వనున్నారు. ఇందులో పనుల వివరాలన్నీ సమగ్రంగా పొందుపర్చిఉంటాయి.  ఏపని ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటిలోగా పూర్తి చేయాలి, కాంట్రాక్టర్​ ఎవరు? లాంటి వివరాలన్నీ ఇందులో పొందుపరుస్తారు. దీంతో ఒకే క్లిక్​తో  పనుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాలను ఎండీ ఆఫీసు డ్యాష్​ బోర్డుకు లింక్ చేస్తారు. దీంతో ఎండీ ఎప్పుడైనా ఏ డివిజన్​ పరిధిలో ఎన్ని పనులు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. దీనివల్ల  అధికారులు, కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా ఉంటారు. ప్రస్తుతం బోర్డు పరిధిలో 1.87 లక్షల పనులు జరుగుతుండగా, ఈ పనులకు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. తాగునీటి వ్యవస్థకు సంబంధించి 95,778 , డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి 87,126 పనులు జరుగుతున్నట్టు వివరించారు. ఆయా పనులను 560 మంది కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.