ఇబ్రహీంపట్నం, వెలుగు: రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకొని, వీఐపీ కోటాలో తక్కువ రేటుకే కారు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పిస్తానని ఓ పూజారిని మోసగించిన నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ పూజారి మీగడ మురళి వద్దకు వచ్చిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌కు చెందిన తాటిపల్లి నవీన్ గౌడ్ ఈ మోసానికి పాల్పడ్డాడు.
నవీన్ మాటలను నమ్మిన పూజారి విడతల వారీగా కారు కోసం రూ.11 లక్షలు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పిస్తానంటే ప్రాసెసింగ్ ఫీజు తదితరాలకు మరో రూ.3,77,150 కలిపి మొత్తం రూ.14,77,150 అందజేశారు. 10 నెలలు గడిచినా ఇల్లు, కారు రాకపోగా, బాధితుడు డబ్బులు అడగడంతో నిందితుడు ఎదురుదాడికి దిగి, రూ.50 లక్షల పరువు నష్టం దావా వేస్తానని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్‌బీ నగర్, మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 4 చీటింగ్ కేసులున్నట్లు తేలిందని సీఐ రమేశ్పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులడిగితే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
