మా వాళ్ల ఆచూకీ చెప్పండి..ఢిల్లీ తెలంగాణ భవన్ హెల్ప్ లైన్కు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్

మా వాళ్ల ఆచూకీ చెప్పండి..ఢిల్లీ తెలంగాణ భవన్ హెల్ప్ లైన్కు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్
  •     తొలి రోజు దాదాపు 100 కాల్స్ చేసిన బాధిత కుటుంబీకులు
  •     23 మందికి సంబంధించిన కేసులను గుర్తించిన అధికారులు

న్యూఢిల్లీ, వెలుగు: నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ వాసుల సహాయం కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తమవారి ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు భవన్ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. అధికారుల సమన్వయ చర్యలు, ఫాలోఅప్‌‌ పై ఆరా తీస్తున్నారు. కాగా,  తొలి రోజు సుమారు 80 నుంచి 100 కాల్స్ అందినట్టు గురువారం భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఇందులో 20 కేసులను తదుపరి చర్యలు చేపట్టాల్సిన వాటిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 23 మంది ఉండగా.. వారిలో ఆరుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాగా, 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్ఆర్ఐలు ఉన్నట్టు తెలిపారు. ఇందులో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో మిగిలిన 22 మంది పరిస్థితిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతర ఫాలోఅప్ కొనసాగుతోందని తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది నేపాల్ - టిబెట్ ప్రాంతంలో ప్రయాణిస్తున్నవారే కాగా.. రసువా, రసువాగఢి, గ్యిరోంగ్ ప్రాంతాలు వీరి చివరి ఆచూకీగా అధికారులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయం, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్టు భవన్ అధికారులు స్పష్టం చేశారు.  

డీఆర్డీఓ మాజీ చైర్మన్ ఫ్యామిలీ క్షేమం..

మరోవైపు నేపాల్ లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్ డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లారు. అయితే, తాజా భీకర వరదల నేపథ్యంలో ఆయన ఆచూకీపై ఆందోళన నెలకొంది. సతీశ్ రెడ్డితో  కూడిన బృందం తాము క్షేమంగానే ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు గురువారం ఆ బృందం ఒక వీడియోను విడుదల చేసింది. విపత్తు సంభవించే సమయానికి తామంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయినట్టు వెల్లడించింది.