- మరో ముగ్గురికి తీవ్రగాయాలు
- నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో ట్రాలీ ఢీకొనడంతో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివే ఐదుగురు విద్యార్థులు బుధవారం భోజనం చేసి నడుచుకుంటూ హాస్టల్కు వెళ్తుండగా, వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చౌకుపల్లి గ్రామానికి చెందిన ఆశాల హర్షవర్ధన్(18) అక్కడికక్కడే చనిపోయాడు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సముద్రపల్లి గ్రామానికి చెందిన మొర్ర శివరాజ్(17) తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ ప్రమాదంలో స్టూడెంట్లు అన్నుట్ల అక్షయ్, కడ్తాల కౌముద్ రెడ్డి, ఆటోలో ప్రయాణిస్తున్న బూరి నర్సయ్య గాయపడగా ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐ మహేందర్రెడ్డి సందర్శించారు.
బైక్ ఢీకొని రిటైర్డ్ టీచర్..
గండిపేట: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ బస్టాప్ సమీపంలో బైక్ ఢీకొని రిటైర్డ్ టీచర్ మల్లేపల్లి భిక్షపతి(79) చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దషాపూర్కు చెందిన భిక్షపతి శుక్రవారం ఉదయం షాద్నగర్లో తన కొడుకు కడుతున్న ఇంటి పనులు చూసేందుకు బయలుదేరాడు.
పెద్దషాపూర్ బస్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా, కొత్తూరు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన భిక్షపతిని 108లో తొండుపల్లి లిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
