వెలుగు ఓపెన్ పేజీ : డిజిటల్ విద్యకు దిక్సూచి టి-శాట్

వెలుగు ఓపెన్ పేజీ : డిజిటల్ విద్యకు దిక్సూచి టి-శాట్

విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు.  ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం అభివృద్ధిని మార్చగల శక్తి.  ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాల్లో పెనుమార్పు వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికతను జోడిస్తూ టి-శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. విద్యార్థి విద్యా పునాదులు పాఠశాలస్థాయి నుండే బలోపేతం కావాలనే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంటే అదే బాటలో పయనిస్తూ ఇటీవ‌‌ల‌‌ టి-శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్​తో ప్రసారాలపై ఎంఓయూ కుదుర్చుకోవడం శుభపరిణామం.

నాణ్యమైన విద్య  ప్రభుత్వ విద్యా వ్యవస్థ లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ విద్యా వ్యవస్థ లక్ష్యం కావాలి. అయితే తరగతి గదిలో మంచి బోధనతోపాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరమవుతోంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టి-శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్‌‌సెట్ డిజిటల్ కోర్సు ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకడమిక్ మాడ్యూల్స్‌‌ను  ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో  డిజిటల్ పాఠాలను అందించింది. టీవీ ప్రసారంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.  ఇక్కడ టి-శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడంలోనే లేదు. విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్ట్ వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్షా విధానంపై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమైన పరిణామం. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందకు  ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి ఉచిత డిజిటల్ కంటెంట్ ఎంతో ఉపయోగకరం. ఎప్‌‌సెట్‌‌తోపాటు  జేఈఈ,  మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పీజీ సెట్, గ్రూప్స్, ఎస్‌‌ఎస్‌‌సీ, ఆర్‌‌ఆర్‌‌బీ, పోలీస్ ఉద్యోగాలు, డీఎస్‌‌ సీ, టెట్, వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా టి-శాట్ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది.

విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం

ఆగస్టు 22న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, టి-శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.  ఈ ఎంఓయూ ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టి-శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు, ‘మా జిల్లా- మా పాఠశాల’, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టీఎల్‌‌ఎం మేళాలు, పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ కార్యక్రమాలు కూడా టి-శాట్​లో ప్రసారమవుతాయి. టి-శాట్  వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను పెంచుకోవడం ప్రభుత్వ  విద్య బలోపేతానికి సానుకూలంగా మారుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ యూనివర్సిటీతో కుదిరిన ఎంఓయూతో ఆన్ లైన్‌‌లో విద్యా అవకాశాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు.   టి-శాట్  పేద విద్యార్థికి ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్.  గ్రామీణ విద్యార్థికి నాణ్యమైన విద్యా వేదిక.  పోటీ పరీక్షల అభ్యర్థికి మార్గదర్శి.  ప్రభుత్వ విద్యకు సాంకేతిక బలం. తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యను అందించాలన్నది  టి-శాట్ లక్ష్యం. 


- ఐ.వి.మురళీకృష్ణ శర్మ
జర్నలిస్టు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.