హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనను తాత్కాలికంగా నిలిపివేసి వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్ వంటి మంచు కురిసే ప్రాంతాల్లో ఈ నెల 17న జనగణన మొదలైందని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన 40 ప్రశ్నలపై బీసీ సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కులగణనలోని లోపాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాయడాన్ని స్వాగతించారు.
కాంగ్రెస్ నేతలు లేఖలో ప్రస్తావించిన అంశాలు వాస్తవమేనన్నారు. సమగ్ర కులగణన చేపట్టాలన్న ఉద్దేశం కేంద్రానికి లేదని జాజుల ఆరోపించారు. అందుకే ప్రశ్నావళిని అశాస్త్రీయంగా రూపొందించిందన్నారు. కులగణనలో ఓపెన్ ఫార్మాట్‌ను తొలగించి, కచ్చితమైన వివరాలు నమోదు చేసేలా డ్రాప్‌డౌన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ కులగణనపై చర్చించేందుకు వచ్చే నెల 20న హైదరాబాద్‌లో బీసీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
