ఫీజు రీయింబర్స్ మెంట్ పై సీలింగ్ సరికాదు..ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలి

ఫీజు రీయింబర్స్ మెంట్ పై  సీలింగ్ సరికాదు..ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలి
  •     మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ 
  •     బీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్​మెంట్,​ 
  • స్కాలర్​షిప్​ ఇవ్వాలని డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్​  ఇవ్వాలని మాజీ గవర్నర్  బండారు దత్తాత్రేయ కోరారు. ఫీజు రీయింబర్స్​మెంట్ పై సీలింగ్  పెట్టడం సరి కాదన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్  వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్  మధుసూదనాచారి, ఎర్ర సత్యనారాయణ, నాగుల శ్రీనివాస్ యాదవ్, గుజ్జ కృష్ణతో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్​మెంట్  కోసం విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి క్వాలిటీ విద్యను ఇస్తానని చెబుతున్నారని, ఈక్రమంలో విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 

విద్యార్థుల ఖాతాలో డబ్బులు జమ చేస్తానని చెప్పడం తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. పెండింగ్  ఫీజు రీయింబర్స్మెంట్  బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్  చేశారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో టీసీలు, మెమోలు, ఇతర ధ్రువపత్రాల కోసం తిప్పలు పడుతున్నారని చెప్పారు. పాండు యాదవ్, కోలా జనార్ధన్, నాగల శ్రీనివాస్  యాదవ్, సతీశ్, బోయ గోపి, శివమ్మ పాల్గొన్నారు.

ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలి

పంజాగుట్ట: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించి గౌరవించాలని మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ కోరారు. గురువారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల రౌండ్​ టేబుల్​ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేకత ఉందన్నారు. 

సీనియర్​ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ దోపిడి వర్గాల చేతిలో రాజ్యాధికారం ఉండడం ప్రమాదమన్నారు. ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య, బీసీ కమిషన్​ మాజీ చైర్మెన్​ బీఎస్​ రాములు, శ్రీశైలం, యాదగిరి. పవన్, శ్రీనివాస్​ పాల్గొన్నారు.