- మాకు ఎలాంటి బేషజాలు లేవు.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం
- విజయవాడ హైవేపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లను త్వరగా పూర్తి చేయాలి
- రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, అభివృద్ధే లక్ష్యమని చెప్పారు. గురువారం సెక్రటరియెట్లో రోడ్లు భవనాల శాఖపై ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దసరా నాటికి చిట్యాల ఫ్లై ఓవర్ పూర్తి చేయాలన్నారు. మిగతా వాటిని డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తెచ్చి సంక్రాంతి వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలన్నారు.
ఈ హైవేపై ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని ఆపాలంటే రోడ్డు విస్తరణ అవసరమన్నారు. ఎనిమిది వరుసల రహదారి విస్తరణ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామని చెప్పారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో మరోసారి గడ్కరీని కలుస్తామన్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీనీ కలుస్తామన్నారు. రాష్ట్ర పరిధిలో చేపట్టిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇటీవల కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతోపాటు గత కొద్ది నెలలుగా చోటుచేసుకున్న పలు ప్రమాదాలపై మంత్రి ఆరా తీశారు. మూగ జీవాలు రోడ్లపైకి రాకుండా రెయిలింగ్ తో పాటు రోడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ లింగారెడ్డి, సీఈలు వసంత్ నాయక్, ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
