తెలంగాణలో గురుకులాల అడ్మిషన్లపై గందరగోళం..ఆగస్టు పూర్తవుతున్నా స్కూళ్లలో పూర్తికాని ప్రక్రియ

తెలంగాణలో గురుకులాల అడ్మిషన్లపై గందరగోళం..ఆగస్టు పూర్తవుతున్నా స్కూళ్లలో పూర్తికాని ప్రక్రియ
  •     జిల్లాల్లో స్పాట్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించాలని డిమాండ్​
  •     వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టిన వేకెన్సీ లిస్ట్‌‌‌‌ తొలగింపు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల స్కూళ్లలో ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నా, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని అధికారులు బహిరంగంగా వెల్లడించడం లేదు. కొన్ని జిల్లాల్లో స్పాట్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ ద్వారా సీట్లు భర్తీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఆగస్టు ముగుస్తున్నా గురుకులాల్లో అడ్మిషన్లు పూర్తికాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌‌‌‌ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు సుమారు 1.80 లక్షల సీట్లను కామన్‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ద్వారా భర్తీ చేశారు. అయితే సీటు నచ్చిన ప్రాంతంలో రాకపోవడం, ఇతర ప్రాంతాలకు బదిలీ కావడం, సీట్లు వచ్చినా కొందరు విద్యార్థులు చేరకపోవడంతో పలు చోట్ల సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

జిల్లాకో రూల్‌‌‌‌.. తల్లిదండ్రులకు తిప్పలు..

గత మూడు నెలలుగా ఖాళీ సీట్ల వివరాలు, వాటి భర్తీ విధానం, కౌన్సెలింగ్‌‌‌‌ తేదీలపై స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు గురుకుల సొసైటీల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో గురుకులాల సీట్లకు డిమాండ్‌‌‌‌ ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో స్పాట్‌‌‌‌ అడ్మిషన్లు నిర్వహిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తల్లిదండ్రులకు సమాచారం కూడా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ గురుకులాల్లో ఇంకా 2 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. జిల్లాల వారీగా స్పాట్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించి వీటిని భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. వారంలోగా అన్ని జిల్లాల్లో కౌన్సెలింగ్‌‌‌‌ పూర్తి చేస్తామని వెల్లడించారు.

వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టి తీసేశారు..

ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఖాళీలు లేవని అధికారులు చెబుతున్నప్పటికీ.. తెలంగాణ సోషల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌, బీసీ గురుకుల సొసైటీల వెబ్‌‌‌‌సైట్లలో కొంతకాలం వేకెన్సీ లిస్ట్‌‌‌‌ అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత వాటిని తొలగించారు. ప్రస్తుతం ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని భర్తీ అయ్యాయనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

రెకమెండేషన్ కోసం మంత్రుల వద్దకు..

ఖాళీ సీట్ల వివరాలు స్పష్టంగా లేకపోవడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్లు ఇప్పించాలని, సిఫార్సు లేఖలు ఇవ్వాలని కోరుతూ మంత్రులను కలుస్తున్నారు. సీట్ల భర్తీ, అడ్మిషన్లపై పలువురు సంఘాల నేతలు బీసీ కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేయగా.. బ్యాక్‌‌‌‌లాగ్‌‌‌‌ సీట్ల భర్తీపై వివరణ ఇవ్వాలని బీసీ గురుకులాల కార్యదర్శిని కమిషన్‌‌‌‌ ఆదేశించింది. 

మంత్రి ఆదేశించినా హెల్ప్‌‌‌‌ డెస్క్‌‌‌‌లు లేవు..

జులైలో టీజీఎస్‌‌‌‌డబ్ల్యూఆర్‌‌‌‌ఈఐఎస్‌‌‌‌ ప్రధాన కార్యాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి అర్హులైన విద్యార్థులకు సీట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌‌‌‌కు రావాల్సిన అవసరం లేకుండా ప్రతి జిల్లా కలెక్టరేట్‌‌‌‌లో సొసైటీ అధికారి ఆధ్వర్యంలో హెల్ప్‌‌‌‌డెస్క్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు మంత్రి ఆదేశాలు కార్యరూపం దాల్చలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

సీటు ట్రాన్స్‌‌‌‌ఫర్ కోసం వచ్చాం 

బీసీ గురుకులాల్లో ఎంట్రెన్స్‌‌‌‌లో సీటు వచ్చింది. కానీ ఆ స్కూల్ దూరం ఉంది. సీటును సమీపంలోని స్కూల్‌‌‌‌కు బదిలీ చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు సొసైటీ ఆఫీసుకు వచ్చాం. ఇక్కడ అధికారులు ఉండట్లేదు. ఎక్కడ ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో చెప్పట్లేదు. ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో అర్థం కావడం లేదు. 
- ఓ విద్యార్థి తల్లి, వికారాబాద్ 

ఆఫీసర్లు స్పందించట్లేదు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీటు కావాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. ఆగస్ట్  ముగుస్తున్నా సీటు రాలేదు. సొసైటీ హెడ్ ఆఫీస్ కు వస్తే అధికారులు ఉండటం లేదు. జిల్లాలో ఆర్సీవోను కలవాలని హెడ్ ఆఫీస్ లో చెబుతున్నారు. అక్కడికి వెళ్తే హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ తేవాలని అంటున్నారు.
‌‌‌‌- సత్యనారాయణ, ఓ విద్యార్థి తండ్రి, వరంగల్