హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చార్జిషీట్ పేరుతో బీఆర్ఎస్ నేతలు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం నిజమైన ప్రజాపాలన కొనసాగుతోందన్నారు.
ఆంధ్ర ప్రయోజనాలను కాపాడడం కోసం తెలంగాణను దెబ్బతీసిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ కు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రైతులు, యువత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు అసలే లేదన్నారు. రైతులకు ఎరువులు, విద్యుత్, సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇస్తూ వారి భవిష్యత్‌ను కాపాడడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. యువతను రెచ్చగొడుతూ వారి భవిష్యత్‌తో రాజకీయాలు చేసే నీచమైన చరిత్ర బీఆర్ఎస్ దేనని ఆయన మండిపడ్డారు.
