రాష్ట్రంలో భారీగా ఆధునిక ధాన్యపు సైలోలను నిర్మించాలి : మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి

రాష్ట్రంలో భారీగా ఆధునిక ధాన్యపు సైలోలను నిర్మించాలి : మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి
  •     అధికారులకు మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి ఆదేశం
  •     నిర్మాణం, నిర్వహణలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణకు అనుగుణంగా అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక ధాన్యపు సైలోల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల సంస్థ కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంప్రదాయ గోదాములతో భవిష్యత్ అవసరాలను తీర్చడం సాధ్యం కాదని, ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, యాంత్రిక రవాణా, శాస్త్రీయ సంరక్షణ, డిజిటల్ పర్యవేక్షణతో కూడిన ఆధునిక నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

సైలోల నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతతోపాటు గ్రామ స్థాయిలో శాశ్వత నిల్వ నిర్వహణకు అనువైన నమూనాలను రూపొందించాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేర్‌‌హౌసింగ్ సంస్థకు దాదాపు ఆరు లక్షల టన్నుల సొంత నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, భారీగా పెరుగుతున్న ధాన్యం సేకరణకు ఇతర సంస్థలు, అద్దె గోదాముల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. వచ్చే సీజన్‌‌లో 90 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నామని, ప్రస్తుతం దాదాపు 12 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

బకాయిల వసూళ్లకు  పటిష్ట కార్యాచరణ..

డిఫాల్టర్ కస్టమ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలను వేగంగా వసూలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. న్యాయపరమైన, పరిపాలనా పరమైన చర్యల ద్వారా ప్రజాధనాన్ని తిరిగి రాబట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ధాన్యం నిల్వల వేలంలో పూర్తి పారదర్శకత ఉండేలా జీఈఎం, రాష్ట్ర ఈ-ప్రొక్యూర్‌‌మెంట్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.