విశాఖలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తుండగా మాయం..!

విశాఖలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తుండగా మాయం..!

అమరావతి: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను అర్ధరాత్రి ఓ యువతీ, యువకుడు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ దంపతులు షాపులకు ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు.

 మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన వారు.. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద తమ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఎస్‌.రాయవరం ప్రాంతానికి చెందిన ప్రతిభ, గరివిడి ప్రాంతానికి చెందిన ఉపేంద్ర అనే ఇద్దరు స్కూటీపై వచ్చి బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. 

సీసీటీవీ దృశ్యాల్లో నిందితులు బాలికను గాజువాక వైపు తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారి ఎలా కిడ్నాప్‌కు గురైంది..? ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారు..? ప్రస్తుతం బాలిక ఎక్కడ ఉంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.