హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. గుర్తు తెలియని వాహనం మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ( ఆగస్టు 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గోల్కొండకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే యువకుడు నార్సింగి నుండి గండిపేటవైపు డెలివరీ తీసుకొని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మితిమీరిన వేగంతో వచ్చిన వాహనం అబ్దుల్ ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని చెబుతున్నారు స్థానికులు. వాహనం కొట్టిన వెంటనే అదుపుతప్పి ఫుట్పాత్ పై పడి ప్రాణాలు విడిచాడు అబ్దుల్. అబ్దుల్ ఫస్ట్ క్లబ్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు పోలీసులు.
