కన్నడ పాలిటిక్స్‎లో కీలక పరిణామం: బోరున విలపిస్తూ మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

కన్నడ పాలిటిక్స్‎లో కీలక పరిణామం: బోరున విలపిస్తూ మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

బెంగళూర్: కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‎లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి.నాగేంద్ర రెండో సారి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను శుక్రవారం (ఆగస్ట్ 28) సీఎం డీకే శివకుమార్‎కు పంపించారు. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‎ ఆరోపణల నేపథ్యంలోనే 2024లో కూడా నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల డీకే శివకుమార్ కర్నాటక సీఎం పగ్గాలు చేపట్టాక మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. శివకుమార్ కేబినెట్‎లో మళ్లీ నాగేంద్రకు మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీజేపీ వాల్మీకి కుంభకోణం అంశాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చి నాగేంద్ర రాజీనామా కోసం పట్టుబట్టింది. ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే ప్రమాదం కనిపించడంతో నాగేంద్రతో మళ్లీ రాజీనామా చేయించింది కాంగ్రెస్ హైకమాండ్.

రాజీనామా సందర్భంగా శుక్రవారం (ఆగస్ట్ 28) మంత్రి నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గిరిజన వ్యక్తి ఎదగడం ఇష్టం లేక మనువాదులు తనను చేసుకున్నారని కంటతడి పెట్టుకున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని.. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమైనవి పేర్కొన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి చెడుపేరు రాకూడదనే ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. 

ఈ విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తాననే పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఉప ఎన్నిక ఎదుర్కొనేందుకు సిద్ధమని బీజేపీ నేత శ్రీరాములుకు సవాల్ విసిరారు. కాగా, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనను తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్న కేవలం 25 రోజులకే నాగేంద్ర మినిస్టర్ పదవికి రాజీనామా చేయడం కన్నడ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది. 

ఏంటీ వాల్మీకి స్కామ్:

కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ (KMVSTDC) లో జరిగిన భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 187 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి జరిగిందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి.నాగేంద్ర ప్రమేయం ఉందని.. వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతో నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.