గ్రౌండ్‌లోనే కాదు.. బ్రాండ్ మార్కెట్‌లోనూ మన స్టార్లదే హవా: ఫోర్బ్స్ ఇండియా 2026 రిపోర్ట్!  

గ్రౌండ్‌లోనే కాదు.. బ్రాండ్ మార్కెట్‌లోనూ మన స్టార్లదే హవా: ఫోర్బ్స్ ఇండియా 2026 రిపోర్ట్!  

Forbes India 2026: భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. కోట్ల మంది ఆరాధించే ఒక అతిపెద్ద పండుగ.. టీమిండియా స్టార్ ప్లేయర్లు మైదానంలోకి దిగితే రికార్డులు బ్రేక్ అవుతాయి, అదే వాణిజ్య ప్రపంచంలోకి అడుగుపెడితే బిజినెస్ డీల్స్ దుమ్మురేపుతాయి. ప్రపంచంలోనే ఏ క్రీడాకారులకూ లేనంతటి ఫ్యాన్ బేస్, మార్కెట్ పొటెన్షియల్ భారత క్రికెటర్ల సొంతం. తమ ఆటతీరుతో పాటు మైండ్ బ్లాకింగ్ పర్సనాలిటీ, సోషల్ మీడియా ఇంపాక్ట్‌తో స్టేడియం సరిహద్దులు దాటి కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్నారు. ఆటకు వీడ్కోలు పలికినా సరే, వీరి బ్రాండ్ వ్యాల్యూ కొద్దిగా కూడా తగ్గకపోవడం వీరికున్న భారీ క్రేజ్‌కు అద్దం పడుతోంది. తాజాగా ప్రముఖ వ్యాపార పత్రిక వెల్లడించిన ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026 (Forbes India Showstoppers 2026) అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో ఇండియన్ క్రికెటర్లు తమ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 

షారూఖ్, ప్రియాంకలను దాటేసిన కింగ్ కోహ్లీ: 

సినిమా, సంగీతం, క్రీడలు.. ఇలా దేశంలోని అన్ని రంగాల బిగ్ సెలబ్రిటీలను దాటుకుని కింగ్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (రూ.3,017 కోట్లు), గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా (రూ.2,507 కోట్లు)లను వెనక్కి నెట్టి కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. టీ20, టెస్టుల నుంచి తప్పుకున్నా కోహ్లీకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. బ్రాండ్ విలువ: ఏకంగా రూ.3,542 కోట్లు  
 
రెండో స్థానంలో కెప్టెన్ కూల్ ధోనీ: 

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ జాబితాలో రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అతడి బ్రాండ్ విలువ సుమారు రూ.2,141 కోట్లు.  మహీ భాయ్ క్రికెట్‌కు దూరమైనప్పటికీ ధోనీకి ఉన్న అభిమానగణం, వ్యాపార కార్యకలాపాలు, ప్రకటనల ఒప్పందాలు అతడి బ్రాండ్ విలువను భారీగా నిలబెట్టాయి. మొత్తం భారత సెలబ్రిటీల జాబితాలో ధోనీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. 

మూడో స్థానంలో మాస్టర్ సచిన్: 

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఫోర్బ్స్ జాబితాలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సచిన్ బ్రాండ్ విలువ రూ.1,676 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయి ఎన్నో సంవత్సరాలు గడిచినా.. సచిన్ బ్రాండ్ ప్రభావం మాత్రం కొనసాగుతుంది. మొత్తం సెలబ్రిటీల లిస్టులో ఆయన 8వ స్థానంలో నిలిచాడు.

నాలుగో స్థానంలో బుమ్రా: 

ఇక భారత క్రికెటర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో అత్యంత బ్యాండ్ వ్యాల్యూ కలిగిన వారిలో ఒకడిగా నిలిచాడు. అతడి బ్రాండ్ విలువ రూ.1,142 కోట్లుగా నమోదు అయింది. ఫోర్బ్స్ జాబితాలో బుమ్రా మొత్తం 16వ స్థానంలో నిలిచాడు. మైదానంలో భారత పేస్ దళానికి నాయకుడిగా ఎదిగిన బుమ్రా.. వాణిజ్యంగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఐదో స్థానంలో రోహిత్ శర్మ: 

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెటర్ల జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతడి బ్రాండ్ విలువ రూ.1,055 కోట్లు అని చెప్పాలి.. మొత్తం సెలబ్రిటీల జాబితాలో రోహిత్ 18వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి విజయాలు, అభిమానుల్లో ఉన్న ఆదరణ, వాణిజ్య ఒప్పందాలు బ్రాండ్ విలువను పెంచడంలో కీలకంగా మారాయి.

ఫోర్బ్స్ ఇండియా 2026 టాప్–5 జాబితాలో చోటు దక్కించుకున్న ఈ ఐదుగురు భారత క్రికెటర్ల మొత్తం బ్రాండ్ విలువ కలిపితే ఏకంగా రూ.9,556 కోట్లు కావడం విశేషం. గ్రౌండ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో పాటు మైదానం బయట వారికున్న లీడర్‌షిప్ క్వాలిటీస్, సోషల్ ఇమేజ్ ఇండియన్ ఆటగాళ్లను గ్లోబల్ మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌లుగా నిలబెడుతున్నాయి.