కాప్రా చెరువులో ఈసారి గణేష్ నిమజ్జనాలు ఉండవు : హైడ్రా కమిషనర్

కాప్రా చెరువులో ఈసారి గణేష్ నిమజ్జనాలు ఉండవు : హైడ్రా కమిషనర్

కాప్రా చెరువులో గణేశ్ నిమజ్జానాలకు వెలుసులు బాటు లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు . 2026 ఆగస్టు 29న కాప్రా చెరువును పరిశీలించిన కమిషనర్.. ఈసారి నిమజ్జనాలకు వీలులేదని.. చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. 

కాప్రా చెరువు అర్బన్ వెట్‌ల్యాండ్ జాబితాలో ఉందని తెలిపారు కమిషనర్ రంగనాథ్ . పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్‌గా కాప్రా చెరువును పేర్కొన్నారు. కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనం సరికాదని ఈ సందర్భంగా అన్నారు. 

చిన్న విగ్రహాల నిమజ్జనానికి చెరువు పక్కనే ఉన్న బేబీ పాండ్‌ వాడాలని.. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఉత్సవ కమిటీకి సూచించారు. కాప్రా చెరువు జీవవైవిధ్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 

కేంద్రం గుర్తించిన అర్బన్ వెట్‌ల్యాండ్స్ జాబితాలో కాప్రా చెరువు ఉందన్నారు. ఆస్ట్రేలియా, యూరప్ సహా ప్రపంచం నలుమూలల నుంచి 470కుపైగా వలస పక్షులకు కాప్రా చెరువు ఆవాసం అని తెలిపారు. 113 ఎకరాల విస్తీర్ణంలో కాప్రా చెరువు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. 

వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ లక్ష్యంగా చెరువు అభివృద్ధి జరుగుతోందన్నారు. జీవవైవిధ్యం, పక్షుల ఆవాసాన్ని కాపాడేలా కాప్రా చెరువు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కాప్రా చెరువులో 70 శాతం వరకు ప్రైవేట్ పట్టా భూములున్నప్పటికీ.. యజమానులు  అభివృద్ధికి సహకరిస్తున్నట్లు అభినందించారు. 

కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడాలని లేక్ రివైవల్ గ్రూప్ కోరింది. కాప్రా చెరువుకు వచ్చే వలస పక్షుల ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు.  వెట్‌ల్యాండ్స్ పరిరక్షణ, నిర్వహణ నిబంధనలు–2017 ప్రకారం చెరువు రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. చెరువు హద్దుల నిర్ధారణ, ఆక్రమణల నివారణ, కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనాల విషయంలో అందరూ సహకరించాలని హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేశారు.