నేపాల్‌లో వరదలు ఒకవైపు తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగిస్తుంటే, మరోవైపు కొన్ని అమానుష ఘటనలు కలవరపెడుతున్నాయి. విపత్తును కూడా ఛాన్స్ గా భావించి కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరద ఉధృతికి కొట్టుకువచ్చిన లాకర్లను పగలగొట్టి దాదాపు 92 లక్షల రూపాయలను దోచుకున్నారు. అంతేకాకుండా, నదిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ శవంపై ఉన్న బంగారు చెవిపోగులను కూడా లాక్కున్నారు. ఈ షాకింగ్ ఘటనలకు సంబంధించి పోలీసులు మొత్తం 31 మందిని అరెస్టు చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి....
92 లక్షల రూపాయల లాకర్ చోరీ: భోటేకోషి ప్రాంతంలో వరదలకు కొట్టుకుపోయిన డబ్బుల పెట్టె.. ధాడింగ్ జిల్లాలోని గల్చి రూరల్ మునిసిపాలిటీ వద్ద త్రిశూలి నది ఒడ్డున దొరికింది. దీన్ని చూసిన స్థానికులు వెంటనే ఆ పెట్టెను పగలగొట్టి అందులోని నగదును పంచుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు చేసి 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 92,68,505 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఎక్కువగా స్థానికులతో పాటు చిత్వాన్, పర్సా ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. అసలు ఆ డబ్బు ఎవరిదనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మృతదేహంపై ఆభరణాల చోరీ: నారాయణి నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం నుంచి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా బంగారు చెవిపోగులను తీసేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆ వీడియో ఆధారంగా ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
నేపాల్‌లో భారీ ప్రాణనష్టం: నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ వరదల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 626కి చేరింది. ఇంకా 2,426 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
