మనుషులు రెండే రెండు తెగలు. ఈగలు – తేనెటీగలూనూ. తేనెటీగలెప్పుడూ పువ్వుల మీదికే పోతాయి. పువ్వు మీద వాలి తేనె గ్రహించి వెళ్లిపోతాయి. అంతచేసినా పువ్వు నలగదు. రేకులూడవు. ఇదొక తరహా. ఈ తరహా మనుషులు మంచి వైపే, మంచి కోసమే, మంచిగానే పోతారు. ఇంక ఈగలున్నాయే ఇవి కురుపు మీద వాలి కెలుకుతాయి. మురికి మీద తిరుగుతూ కులుకుతాయి. ఇదంతా వాటికాహారం. కొంతమంది మనుషులూ అంతే! వారెప్పుడూ కుళ్లుతో ఉంటారు. కుళ్లు కోసమే చూస్తారు. వారికి మంచి కనిపించదు.
కనిపించిన మంచి మీద కుళ్లు పోస్తారు. మంచితనాన్ని వంచించడానికి నిరంతరం ఈగలు ప్రయత్నిస్తుంటాయి. ప్రపంచంలో ఈగల సంఖ్య హెచ్చు. తేనెటీగలు తక్కువ’’ (ఉషశ్రీ రచించిన ‘పెళ్లాడేబొమ్మా!’ నవలా లేఖావళి 23వ పేజీ నుండి). కొంతమంది మానవులు ఈర్ష్య, అసూయలను జయించలేరు. వాటిని జయించిననాడు మనిషి భగవంతుడవుతాడు. ఇతరులు... సంపన్నులయినా, ఉన్నత స్థాయికి వెళ్లినా అసూయతో రగిలిపోతుంటారు. గెలుపొందినవారిని ఏదో ఒకవిధంగా చెడ్డవారిగా చూపడానికి ప్రయత్నిస్తుంటారు.
పాండవులు రాజసూయ యాగం చేసే సమయంలో సామంతులందరినీ ఓడించి, సంపదలు సముపార్జించి, యాగ సమయంలో దానం చేశారు. ఆ సంపదలు చూసిన దుర్యోధనాదులలో అసూయ బయలుదేరింది. ఏదో ఒకవిధంగా పాండవుల సంపదలను హరించాలనే దురాలోచన బయలుదేరింది. శకుని సాయంతో పాండవులను జూదానికి పిలిచి, వానితో కపట జూదం ఆడి, పాండవుల సకల సంపదలను హరించి, వారిని అడవుల పాలు చేశాడు దుర్యోధనుడు. పదమూడు సంవత్సరాలు పూర్తయ్యాక వచ్చి, వారి రాజ్యం వారు స్వీకరించవచ్చునని పలికాడు. కాని దుర్యోధనునిలో ఈర్ష్య, అసూయలు కొద్దిమాత్రం కూడా తగ్గలేదు.
అజ్ఞాతవాస సమయంలో వారిని ఏదో ఒక విధంగా గుర్తించి, తిరిగి మరో పదమూడు సంవత్సరాలు అడవులపాలు చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. ఉత్తర గోగ్రహణం పేరుతో వారిని బయటకు రప్పించాడు. అయితే ఆ రోజుతో అజ్ఞాతవాసం ముగిసిందని దుర్యోధనుడికి తెలియదు. అందుకే ‘యతో ధర్మస్తతో జయః’ ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ విజయం ఉండి తీరుతుంది అని పలికాడు వ్యాసుడు.
అనగనగా ఒక ఊరిలో ఒక నక్క, ఒక సింహం, ఒక ఒంటె ఉంటున్నాయి. సింహానికి ఒంటె మీద ప్రీతి ఎక్కువ. దానితో చాలా సన్నిహితంగా ఉండేది. అది చూసిన నక్క ఈర్ష్యతో రగిలిపోయింది. ఎలాగైనా ఒంటెను చంపించాలని ఎత్తువేసింది. ఒంటె లేని సమయంలో సింహం దగ్గరకు వెళ్లి, ఒంటెమీద ఎన్నో నేరాలు చెప్పింది. సింహానికి నక్కజిత్తులు తెలుసు కనుక, నక్క ఏం మాట్లాడినా సింహం మారు మాట్లాడలేదు. నక్కకు ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలనుకుంది.
ఒకరోజు ఒంటెను, నక్కను రెండింటినీ పిలిచి, ‘మీకు నేను ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గినవారికి ఒక బహుమతి ఇస్తాను’ అని చెప్పింది. నక్క, ‘ఎలాగూ నేనే గెలుస్తాను’ అని లోలోపలే సంతోషపడింది. ‘ఈ చెట్టు కనిపిస్తోంది కదా. ఆ చెట్టు కొమ్మన ఉన్న పండుని ఎవరు ముందుగా కోసి నాకు ఇస్తారో వారే ఈ పందెంలో గెలిచినట్లు’ అని ప్రకటించింది. ‘ఓస్ అంతేగా, గబగబ చెట్టు ఎక్కి పండు కోసేస్తాను..’ అనుకుంటూ చెట్టు మీదకు ఎక్కడానికి ప్రయత్నించింది.
ఒంటె స్వయంగా ఎత్తుగా ఉండటమే కాకుండా, దాని మెడ కూడా చాలా పొడవు కాబట్టి, ఒక్కసారి తన తల ఎత్తి, క్షణకాలంలో పండుని కోసి, సింహానికి బహుమతిగా ఇచ్చింది. అది చూసిన నక్కలో మరింత అసూయ బయలుదేరింది. అప్పుడు సింహం, ‘నక్కబావా! నీకున్న తెలివితేటలు ఇతరులకు లేవని నీకు తెలుసు. కాని నీ తెలివితేటలను మంచికి ఉపయోగించాలే కాని, ఇతరుల మీద నేరాలు చెప్పడానికి ఉపయోగించకూడదు. ఒంటె ఒక్కనాడూ నీ మీద నేరాలు చెప్పలేదు.
ఎప్పుడూ నీ తెలివితేటల గురించి ఎంతో చక్కగా పొగుడుతుంది. నీలోని ఈ గుణాన్ని విడిచిపెట్టకపోతే, నీ నాశనానికి నువ్వే కారణమవుతావు. ఈ పోటీలో గెలిచిన ఒంటెను నా ప్రధాన అనుచరునిగా నియమిస్తున్నాను. నువ్వు కూడా నీలో మార్పు తెచ్చుకుని, నా దగ్గర మరో మంత్రిగా చేరు’ అని పలికింది. నక్క సిగ్గుతో తల దించుకుంది. ఈర్ష్య, అసూయలు మనిషిని మృగంలా మారుస్తాయి. వారి నాశనానికి కూడా కారణమవుతాయి.
డా. పురాణపండ వైజయంతి
* మీరూ లైఫ్కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా ?
* అయితే.. కథను హామీ పత్రంతో పాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
