పద్మారావునగర్, వెలుగు: రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు కలిపిన నీరు, ఆహార పదార్థాలు ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.35,400 విలువైన ఒక ఫోన్, నగదుతోపాటు 10 మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా బండలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్, సికింద్రాబాద్ రసూల్‌పుర ఇందిరమ్మ నగర్‌కు చెందిన కొరపాటి నరసింగరావు మద్యానికి బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు.
ఈ నెల 17న సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి.. అనిల్ కుమార్ అనే ప్రయాణికుడితో స్నేహం నటించి మత్తు నీరు తాగించారు. అతను స్పృహ కోల్పోగానే రూ.5,400, ఫోన్ ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, 28న సికింద్రాబాద్ స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు, నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని సూచించారు.
అత్యవసర సమయాల్లో 139, 112 లేదా రైల్ మదద్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు. రైల్వే ఎస్పీ సాయిశేఖర్, డీఎస్సార్పీ ఎస్.ఎన్. జావేద్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకున్న సీఐ సాయిఈశ్వర్ గౌడ్, ఎస్సై సుబ్బారెడ్డి, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ భవానీ శంకర్ సారస్వత్, డివిజనల్ సీపీడీఎస్ సిబ్బందిని రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీపీ రమేశ్‌నాయుడు అభినందించారు.
