అవినీతి అధికారులు తమ అక్రమ సంపాదనను దాచుకోవడానికి నగదు, భూముల కంటే బంగారం వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ, ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల కండ్లు కప్పడానికి అక్రమార్కులు బంగారాన్ని ఒక సురక్షిత సాధనంగా వాడుకుంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
బ్యాంకుల్లో డబ్బు దాస్తే పాన్, ఆధార్ లింకుల వల్ల ఐటీ శాఖ నిఘా ఉంటుంది. కానీ స్థానిక వ్యాపారుల వద్ద నగదు రూపంలో కొనే బంగారానికి ఎలాంటి డిజిటల్ గుర్తింపు ఉండదు. బంగారం ఎప్పటికీ చెల్లుబాటు అయ్యే ఆస్తి కావడం, కొన్ని కోట్ల విలువైన బంగారాన్ని ఒక చిన్న లాకర్ లేదా హ్యాండ్‌బ్యాగుల్లో దాచుకునే అవకాశం ఉండడం మరో కారణం.
భూములు, ఇండ్లు, రియల్ఎస్టేట్లో పెట్టుబడులకు రిజిస్ట్రేషన్లు, లీగల్ పత్రాలు, బినామీల అవసరం ఉంటుంది. బంగారానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ నిబంధనలు ఉండవు. దేశంలో ఎక్కడైనా క్షణాల్లో దీనిని నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదీగాక దర్యాప్తు సంస్థలకు పట్టుబడితే తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తిగా, తమ పెళ్లిళ్లలో వచ్చిన ‘స్త్రీ ధనం’ కింద వచ్చినట్టు చూపి చట్టపరమైన లొసుగుల ద్వారా తప్పించుకునే అవకాశం ఉండడమే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.
అవినీతి అధికారులు రూటు మార్చారు. తమ అక్రమ సంపాదనను ఒకప్పుడు బ్యాంకు లాకర్లలో, షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో, ఇండ్లు, ప్లాట్లు, రియల్ఎస్టేట్ పెట్టుబడుల రూపంలో దాచుకునేవారు. కానీ తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ చేపడ్తున్న వరుస సోదాలతో మరో కొత్త విషయం వెలుగుచూసింది. నగదు, ఆస్తి పత్రాలతోపాటు కిలోల కొద్దీ బంగారం బయటపడుతుండడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
అవినీతి సొమ్ము నగదు, భూముల రూపంలో కన్నా బంగారంగా మార్చి దాచుకోవడమే సురక్షితమని అధికారులు భావిస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఏసీబీ సోదాల్లో పట్టుబడిన బంగారాన్ని తమకు వారసత్వంగా వస్తున్నదనో, పెళ్లి సమయంలో కట్న కానుకల రూపంలో ఇచ్చిందనో లెక్కలు చూపి తప్పించుకుంటున్నారు.
