హైదరాబాద్: గతంలో రైళ్లు ఎక్కితే ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖలో పరిస్థితులు పూర్తిగా మారిపోయారని తెలిపారు. రైళ్లలో పరిశుభ్రత పాటిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులు రైళ్లలో ముక్కు మూసుకునే పరిస్థితి నుంచి హాయిగా ప్రయాణించేలా చేశామన్నారు.
ఆదివారం (ఆగస్ట్ 30) వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ను సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అమృత్ భారత్లో భాగంగా రూ.27 కోట్లతో స్టేషన్లో చేపట్టిన వివిధ పనులను పరిశీలించి పనుల పురోగతిపై రైల్వే అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న అన్ని రైల్వే ట్రాక్లను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఐదుల లక్షల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నామని చెప్పారు. బుల్లెట్ ట్రైన్ వస్తే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరబోతుందన్నారు.
