ఖమ్మంలో క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధికి చర్యలు

ఖమ్మంలో క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధికి చర్యలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో క్రీడా, పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చేసి, జిల్లాకు కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో చేపడుతున్న క్రీడా, పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక వసతులు కల్పించేందుకు రఘునాధపాలెంలో రూ.92.76 కోట్లతో సమగ్ర క్రీడా సముదాయం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 

ఇందులో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ స్టేడియంతో పాటు ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడా సదుపాయాలు, 200 మంది క్రీడాకారుల సామర్థ్యంతో హాస్టల్‌ తదితర 28 రకాల సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టుకు త్వరగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని అధికారులను మంత్రి కోరారు. ఖమ్మంలో పూర్తయిన సింథటిక్‌ ట్రాక్‌కు మౌలిక వసతులు, ఖమ్మం మల్టీపర్పస్‌ స్టేడియం, కొత్తగూడెం యూనివర్సిటీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అంతకుముందు మంత్రి ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 42వ డివిజన్‌లో రూ.95.50 లక్షల చేపట్టనున్న రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, పర్యవేక్షణతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.