- ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భార్యాభర్త, కొడుకు మిస్సింగ్
- వనపర్తి జిల్లాకు చెందిన మరో మహిళ గల్లంతు
వనపర్తి/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: గతంలో గోదావరిలో మునిగి ఒక కొడుకు మృతి.. కొంత కాలానికి క్యాన్సర్‌తో బాధపడ్తూ మరో కొడుకు మృతి.. ఇప్పుడు నేపాల్ వరదల్లో కూతురుతోపాటు అల్లుడు, మనవడు మిస్సింగ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం మేదరబస్తీకి చెందిన రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ స్వామి కుటుంబంలో నెలకొన్న విషాదమిది. ఇప్పటికే ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న స్వామి, రాణి దంపతులు.. తాజాగా తమ కూతురు దీప్తి, అల్లుడు శ్రీధర్ అవ్వారి, మనవడు అభినవ్ గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనలో మునిగారు.
దీప్తి తన భర్త, కొడుకుతో కలిసి ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. నేపాల్‌లోని ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో ఉండగా వరదలు రావడంతో గల్లంతయ్యారు. నాలుగేండ్ల కిందట స్వామి చిన్న కొడుకు బాసరలో గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. ఏడాది కిందట పెద్ద కొడుకు క్యాన్సర్‌తో చనిపోయాడు.ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతురుతో పాటు అల్లుడు, మనవడు నేపాల్ వరదల్లో గల్లంతు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
వీపనగండ్ల మహిళ కూడా మిస్సింగ్..
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన పుట్ట శ్వేత కూడా నేపాల్ వరదల్లో మిస్సయ్యారు. ఆమెకు నెల్లూరు జిల్లా వాసి సురేశ్ రెడ్డితో వివాహమైంది. 20 ఏళ్ల కింద అమెరికాలో సెటిలయ్యారు. ఆమె ఒక్కరే అమెరికా నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లారు.సోమవారం తర్వాత శ్వేత ఆచూకీ తెలీలేదు. దీంతో సోదరుడు మధుసూదన్, భర్త సురేశ్ రెడ్డి నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకుని ఆమె ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు.
