- సీఎం రేవంత్ టైం కోసం ఎదురుచూపులు
- కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురావాలంటున్న ప్రజలు
మహబూబాబాద్, వెలుగు: జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేసుకుని ఓపెనింగ్‌కి రెడీ అయ్యాయి. ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తుండడంతో రోజులు గడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ బిల్డింగ్ రెడీ..
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ కోసం నిర్మించిన భవనంలోనే నాలుగేళ్లుగా అరకొర సౌకర్యాలతో వైద్య కళాశాల నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సింగ్ విద్యార్థులు ఇతర ప్రాంతాల్లోని ఇరుకైన గదుల్లో చాలీచాలని వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని హంగులతో నిర్మించిన నూతన మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించకపోవడం, నర్సింగ్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో సుమారు రూ.186 కోట్లతో జీ+4 అంతస్తుల్లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి 2021 నవంబర్‌లో అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. స్థల వివాదం, నిర్మాణ పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపులు ఆలస్యం తదితర కారణాలతో పనులు పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పట్టింది. 2022లో 150 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ప్రస్తుతం నూతన భవనంలో ఎనిమిది ప్రయోగశాలలు, నాలుగు బోధనా గదులు, పరీక్ష కేంద్రం, వివిధ కార్యాలయ గదుల నిర్మాణం పూర్తయింది. కాలేజీ సమీపంలోనే వైద్య విద్యార్థుల కోసం వేర్వేరుగా వసతిగృహాలను నిర్మించారు. మొత్తంగా మెడికల్, నర్సింగ్ కళాశాలల భవన సముదాయాల కోసం సుమారు రూ.560 కోట్లతో పనులు చేపట్టారు.
నూతన హంగులతో ఎస్పీ ఆఫీస్..
విశాలమైన ప్రాంగణంలో రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ ఆధునిక హంగులతో సిద్ధమైంది. ఆఫీస్ గదులు, మీటింగ్హాల్స్, డిజిటల్ కమాండ్ సదుపాయాలు, ప్రజల కోసం ప్రత్యేక ఫిర్యాదు విభాగం, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక సైబర్ విభాగం సహా అన్ని విభాగాలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఆఫీస్ ఎంట్రెన్స్ప్రవేశం వద్ద ఆకర్షణీయమైన ఆర్చ్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా పూలు, మొక్కలను నాటారు.
రెండో అంతస్తులోనూ ఆధునిక సదుపాయాలతో గదులను నిర్మించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. కార్యాలయం వెనుక భాగంలో సిబ్బంది కోసం ఆట స్థలం, దేహదారుఢ్య శిక్షణ, యోగా కోసం పెరేడ్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు.
తుది దశలో మున్సిపల్ బిల్డింగ్ పనులు..
మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి 2019లో రూ.5 కోట్లతో అనంతారం సమీపంలో శంకుస్థాపన చేశారు. ఏడేండ్ల అనంతరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సీఎం జిల్లా పర్యటనలోగా పనులను పూర్తి చేసి భవనాన్ని ప్రారంభించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు.
త్వరలోనే సీఎం పర్యటన..
మానుకోట జిల్లాలో పూర్తైన ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటుగా నూతనంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ కోసం శంకుస్థాపన, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన త్వరలోనే ఖరారు కానుంది. జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరనున్నాయి.
- భూక్యా మురళీ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
