తిమ్మాపూర్, వెలుగు: రోడ్డు వేయాలని అడుగుతున్న గన్నేరువరం యువకులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెదిరిస్తూ, వారిపై కేసులు పెట్టిస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రసమయి మీడియాతో మాట్లాడారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న పాత్రికేయులు, నాయకులపై ఎమ్మెల్యే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
రోడ్డు సమస్యపై ప్రశిస్తున్న గన్నేరువరం మండల యువకులు శ్రీనాథ్, వంశీ, నాగరాజుపై కేసులు పెట్టడమే కాకుండా, వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. తమపై తప్పుడు పోస్టులు పెట్టి, దాడులు చేయాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్న కవ్వంపల్లి అనురాధ, పీఏ మురళీధర్ రెడ్డిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు సింగిరెడ్డి స్వామిరెడ్డి, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్తదితరులు పాల్గొన్నారు.
