- మండిపడ్డ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్
- బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష
నిర్మల్, వెలుగు: విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని బీజేపీ నిర్మల్‌జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ విమర్శించారు. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ పేరిట నిర్మల్‌లో బీజేవైఎం నిర్వహించిన దీక్షలో రితీశ్‌రాథోడ్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాల వైఖరి కారణంగా విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతోందన్నారు. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష చేపట్టిన నిరంజన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నేత కుమ్మరి వెంకటేశ్ తదితరులకు ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడిసిమ్మ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు విలాస్, రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీజేవైఎం ఒక్కరోజు నిరాహార దీక్ష
జగిత్యాల టౌన్, వెలుగు: బీజేవైఎం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఇట్టేడి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు హాజరై మద్దతు ప్రకటించారు. నాయకులు మాట్లాడుతూ.. గత ఐదేండ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 15 వేల కోట్లు విడుదల చేయక దాదాపు 40 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం బీజేపీ, బీజేవైఎం నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు. బీజేపీ వివిధ మోర్చాల అధ్యక్షులు, మండలాలు, పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
