- మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ అంకం మౌనిక భర్త అంకం మహేందర్.. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి వేధింపులకు గురిచేస్తున్నాడని కమిషనర్ సుందర్ సింగ్ ఆరోపించారు. మున్సిపల్సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. శనివారం జరిగిన మున్సిపల్ సర్వ సభ్య సమావేశానికి వచ్చిన మున్సిపల్ అధికారులపై మహేందర్ దురుసుగా ప్రవర్తించి, రేపటి నుంచి ఆఫీస్కు రావద్దని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై చైర్ పర్సన్ భర్త అజమాయిషీ చలాయించడం ఏమిటని ప్రశ్నించారు. చైర్ పర్సన్ భర్త తీరుకు నిరసనగా తాము సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు. సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
మాపై కుట్రలు చేస్తున్నరు: చైర్ పర్సన్
ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కొందరు అడ్డుపడుతూ తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక, వైస్ చైర్ పర్సన్ షోయబ్ హుస్సేన్ ఆరోపించారు. మున్సిపల్ సమావేశానికి అధికారులు రాకుండా కొందరు నాయకులు కావాలనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.
