జీవో 97ను రద్దు చేయాలి : స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జీవో 97ను రద్దు చేయాలి : స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​/ ధర్మసాగర్​(వేలేరు), వెలుగు: పాలిటెక్నిక్‌‌ విద్యార్థులను లేబర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు అనుసంధానం చేస్తూ తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. పాలిటెక్నిక్‌‌ విద్యను టెక్నికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ పరిధిలోనే కొనసాగించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్ లో ఆయన మాట్లాడారు. పాలిటెక్నిక్‌‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌‌లో లేటరల్‌‌ ఎంట్రీ కొనసాగించాలని కోరారు. స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని, ఆరు నెలల్లో దేవాదుల పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు.

15 రోజుల్లో లేఅవుట్‌‌ మ్యాప్‌‌ సిద్ధం చేయాలి..

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌ మండలం ముప్పారం, వేలేరు మండలం శోడషపల్లిలో ఏనుమాముల మార్కెట్‌‌ పరిధిలోని స్థలాలను మార్కెట్‌‌ చైర్మన్‌‌ ఎర్ర ప్రియాంక అనిల్‌‌తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. 15 రోజుల్లో భూముల సర్వే పూర్తి చేసి లేఅవుట్‌‌ మ్యాప్‌‌ సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. శోడషపల్లి మార్కెట్‌‌ సబ్‌‌యార్డును వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 5 నుంచి 10 వేల మెట్రిక్‌‌ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.