వరంగల్‌‌ రైల్వే స్టేషన్‌‌ తనిఖీ చేసిన జీఎం

వరంగల్‌‌ రైల్వే స్టేషన్‌‌ తనిఖీ  చేసిన జీఎం

కాశీబుగ్గ/ వెంకటాపూర్​( రామప్ప), వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌‌ మేనేజర్‌‌ సంజయ్‌‌కుమార్‌‌ శ్రీవాస్తవ శనివారం వరంగల్‌‌ రైల్వే స్టేషన్‌‌ను తనిఖీ చేశారు. అంతకుముందు సికింద్రాబాద్‌‌–కాజీపేట సెక్షన్‌‌లో నైట్‌‌ ఫుట్‌‌ప్లేట్‌‌ తనిఖీ నిర్వహించి ట్రాక్‌‌, సిగ్నల్స్‌‌, ఓవర్‌‌హెడ్‌‌ ట్రాక్షన్‌‌, వేగ పరిమితులు, రైలు సిబ్బంది అప్రమత్తతను పరిశీలించారు. అమృత్‌‌ భారత్‌‌ స్టేషన్‌‌ పథకం కింద రూ.25.41 కోట్లతో అభివృద్ధి చేసిన వరంగల్‌‌ స్టేషన్‌‌లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. 12 మీటర్ల ఫుట్‌‌ ఓవర్‌‌ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గదులు, ప్లాట్‌‌ఫాం కప్పు తదితర పనులను పరిశీలించారు. 

స్టేషన్‌‌ పరిశుభ్రత, భవిష్యత్‌‌ విస్తరణ ప్రణాళికలను పరిశీలించి, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. వరంగల్​ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జీఎం సంజయ్‌‌కుమార్‌‌ శ్రీవాస్తవ కుటుంబ సమేతంగా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్‌‌ ద్వారా రామప్ప చరిత్ర, శిల్పకళా విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం రామప్ప సరస్సులో కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్‌‌ చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌‌ డీఆర్‌‌ఎం డాక్టర్‌‌ గోపాలకృష్ణన్‌‌, పురావస్తు, దేవాదాయ శాఖ సిబ్బంది, టూరిస్ట్‌‌ పోలీసులు పాల్గొన్నారు.