ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరేమైనా ప్రభువులు అనుకుంటున్నారా..? ఏమైనా చేయొచ్చని భావిస్తున్నారా..?” అని మండిపడింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రాంగణంలో నడుస్తున్న ఐదు రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేస్తూ మహారాష్ట్ర ఎఫ్‌డీఏ జారీచేసిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు శనివారం కొట్టివేసింది.
తాజా తనిఖీల్లో ఈ రెస్టారెంట్లు ఆహార భద్రతా నిబంధనలను 88 శాతం పాటిస్తున్నట్లు తేలడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ విషయం పట్ల ఆచరణాత్మక వైఖరిని విడిచిపెట్టి నిబంధనల పేరుతో కఠిన వైఖరి అవలంబించిన ఎఫ్‌డీఏ అధికారులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో సంబంధిత రెస్టారెంట్లపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి, ఈ అంశాన్ని పునఃపరిశీలించడానికి కమిషనర్ తుకారామ్ ముండే నేతృత్వంలోని ఎఫ్‌డీఏ అంగీకరించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే, న్యాయమూర్తి గౌతమ్ అంఖద్‌తో కూడిన బెంచ్ఈ సస్పెన్షన్‌ను రద్దు చేసింది. తాజా ఎఫ్‌డీఏ తనిఖీ నివేదిక ప్రకారం రెస్టారెంట్లు ఆహార భద్రత నిబంధనలను 88% పాటిస్తున్నాయని కోర్టు వెల్లడించింది.
థర్డ్ పార్టీ ద్వారా రెస్టారెంట్ల నిర్వహణకు సంబంధించిన అంశాలను ఎఫ్‌డీఏ వేరుగా పరిశీలిస్తుండగా, ఈలోగా రెస్టారెంట్లు తిరిగి తెరుచుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అధికారులు సరిగ్గా వ్యవహరించకపోతే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కాగా, అపరిశుభ్రత ఉల్లంఘనలు, థర్డ్ పార్టీ నిర్వహణకు సంబంధించిన అవకతవకల కారణంగా రెస్టారెంట్ల కార్యకలాపాలను సస్పెండ్ చేయాలని ఎఫ్‌డీఏ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎంసీఏ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈమేరకు స్పందించింది.
సిప్లా లైసెన్స్ రద్దుపైనా..
పుణెలోని సిప్లా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కేరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఫెసిలిటీకి సంబంధించిన డ్రగ్ సేల్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ రద్దు చేయడంపై కూడా బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. కంపెనీపై ఎఫ్‌డీఏ అధికారులు అధికార దర్పంతో హద్దు మీరారని తీవ్రంగా విమర్శించింది. ఈ విషయంలో ఎఫ్‌డీఏ తీసుకున్న చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో సిప్లా ఫెసిలిటీ లైసెన్స్ రద్దు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు ఎఫ్‌డీఏ వెల్లడించింది.
