న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కాలం చెల్లిన పదార్థాలతో ఆహారాన్ని అందిస్తున్నారంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈమేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అధికారులు ఈ ఆహారాన్ని తమ పిల్లలకు తినిపించగలరా..? అని ప్రశ్నించారు. తనపై ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా, చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఈ నిజాన్ని బయటపెట్టడం మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు.
అయితే, ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలు.. ఏ పాఠశాలల్లో లేదా ఏ ప్రాంతంలో ఇది జరుగుతోందనే వివరాలను ఆయన వెల్లడించలేదు. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, పారిశుధ్య లోపాలను ఎత్తిచూపుతూ అభిజీత్ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు, తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తొలిసారిగా కంప్యూటర్ అందడం, విద్యార్థులకు బెంచ్‌లు సమకూరడం తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ మార్చ్..
కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత నిలిపివేసిన నిరసనలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. విద్యార్థులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని, గతంలో జరిగిన ఆందోళనల్లో పోలీసుల తీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున నీట్ బాధితులు, విద్యార్థుల కుటుంబాల ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు సీజేపీ వెల్లడించింది.
