తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం రాజకీయ దురుద్దేశమే కాకుండా, ఒక విధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆయన పర్యటనకు కొద్దిరోజుల ముందు గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతించడం కేంద్రం కుంచితత్వాన్ని సూచిస్తున్నది.
ఇద్దరు ముఖ్యమంత్రుల పర్యటన ఉద్దేశం తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడమే. అయినప్పటికీ ఒక రాష్ట్రాన్ని విస్మరించి కేవలం ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌కే పెట్టుబడులు రావాలని ఈ నిర్ణయం వెనుక ఆంతర్యమా?
రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం మన దేశం ఫెడరల్ స్ఫూర్తికి పెద్దపీట వేయడమైనది. విభిన్న మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, భావాలకు నిలయమైనందున భిన్నత్వంలో ఏకత్వంగా పేర్కొన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కేంద్రం, రాష్ట్రాల హక్కులను హరిస్తూ నియంతృత్వ పోకడలతో అణచివేతకు పూనుకుంటున్నది. గత 40 సంవత్సరాల క్రితం కూడా కేంద్రం, రాష్ట్రాల సంబంధాలపై సర్కారియా కమిషన్ను నియమించగా... ఆ కమిటీ చక్కటి రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రాలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో అందులో పేర్కొన్నది.
మోదీ ఏకపక్ష పాలన
12 సంవత్సరాల క్రితం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప పూర్తిగా కేంద్రీకృత, నియంతృత్వ విధానాలను అమలుపరుస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి, సర్కారియా కమిషన్ సిఫార్సులకు పాతరేస్తూ ఏకపక్ష పాలన సాగిస్తున్నది. మోదీ ఎంచుకున్న మార్గం ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండకూడదు. కేంద్రీకృత ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తూ, వికేంద్రీకరణను తుంగలో తొక్కేశాడు. అందుకు ఆయన పెద్ద నోట్ల రద్దు చేసి విఫలమై కేంద్రీకృత ఒకే దేశం ఒకే విధానమనే నినాదంతో లౌకిక వ్యవస్థకు విఘాతం కల్పిస్తున్నారు.
ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తూ ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తూ రాజ ద్రోహం లాంటి కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరొకవైపు ప్రతిపక్షాల ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్రీకృత నియంతృత్వానికి రూపకల్పన చేస్తున్నాడు. జీఎస్టీ ద్వారా నిధులు కేంద్రానికి చేరిన తర్వాత రాష్ట్రాలకు విడుదల చేస్తారు. ఇది నియంతృత్వానికి నిదర్శనమా? అంతకుముందు రాష్ట్రాల నుంచి కేంద్రానికి పంపించడం జరిగేది. మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో ఉండాలని దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రాలు అభివృద్ధి కాకుండా.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ?
అచ్చేదిన్ అంటూ అభివృద్ధిని అడ్డుకోవడం ఏమిటి? రాష్ట్రాలు అభివృద్ధి కాకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2047 రైజింగ్ తెలంగాణ విధానంతో అనేక దేశాల నుంచి పరిశ్రమలను ఆకర్షిస్తూ, ఫ్యూచర్ సిటీతో సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే అనేక దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ బాట పెట్టారు.
అందులో భాగంగానే అమెరికా, లండన్ దేశాల పర్యటనకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం వారి నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఇప్పటికే ప్రతిపక్షాల రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడంలో సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాంటి ఆలోచనలకు తిలోదకాలు ఇవ్వడం అంటే దుర్మార్గమైన చర్య. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం అంటే తెలంగాణ రాష్ట్రం, ప్రజలపై చిన్న చూపు, నిర్లక్ష్యం, అణచివేత.
తెలంగాణ ఉద్యమాల గడ్డ
తెలంగాణ ప్రజలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని కూడా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కానందున నిరాశపడలేదు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని నినదించి నిజాం నవాబును గద్దె దించడానికి వీరోచితమైన తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించవలసి వచ్చింది. అందుకే తెలంగాణకు ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు. సాయుధ పోరాట త్యాగాలు, బలిదానాలతో సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో విలీనమైంది. ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఎవ్వరికీ తలవంచదు, తలదించదు.
ఆత్మగౌరవ పరిపాలన కావాలని కోరుకునే త్యాగాల గడ్డ. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అవమానపరిస్తే తెలంగాణ ప్రజలను కించపరచడమే. అందుకనే తెలంగాణ గడ్డ స్ఫూర్తికి పెద్దపీట వేయడానికి. ప్రజాస్వామ్య ప్రగతి శీల శక్తులు ఏకమై తెలంగాణ ఆకాంక్షలను నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నియంతృత్వ పోకడలను ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలి. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
చాడ వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకుడు
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
