ఇథనాల్ ఉత్పత్తితో.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం ?

ఇథనాల్ ఉత్పత్తితో.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం ?

ఇథనాల్ పెట్రోల్ అమ్మకాలు మొదలైన తర్వాత  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇథనాల్ పెట్రోల్ వాడితే తమ వాహనాలు దెబ్బతింటున్నాయని,  మైలేజ్ కూడా రావడం లేదని వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఇథనాల్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇటు వాహనదారులకు, రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్నదని, కొందరి మేలు కోసమే ఇథనాల్ పెట్రోల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇథనాల్ పెట్రోల్ వల్ల మరో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. అదే ఆహార సంక్షోభం.  కేంద్ర ప్రభుత్వం  దశలవారీగా ఇథనాల్ పెట్రోల్  విధానాన్ని అమలు చేస్తున్నది.

పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొద్దికొద్దిగా ఇథనాల్ కలుపుతూ  విక్రయిస్తున్నది.  2020లో 5శాతం ఇథనాల్ కలిపి పెట్రోల్ ను విక్రయించిన పెట్రోలియం శాఖ.. క్రమంగా పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇథనాల్ శాతం పెంచుతూ వస్తున్నది.  2026లో  పెట్రోల్  ఇథనాల్ శాతం 20కి పెరిగింది. ఇథనాల్  పెట్రోల్‌లో వాడకంతో  ఇతర దేశాలపై చమురు కోసం ఆధారపడకుండా ముడిచమురు దిగుమతులు తగ్గించి,  విదేశీ మారకం నిల్వలను పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అంతేకాదు రైతులకు ఇది మేలు చేస్తున్నదని సమర్థించుకుంటున్నది.

మన దేశంలో  E20  పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగించే ఇథనాల్ తయారీకి ముడిసరుకుగా చెరకు, మొక్కజొన్న,  వరి వినియోగిస్తున్నారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నీతి ఆయోగ్ రిపోర్టులను పరిశీలిస్తే 2020 నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడి సరుకు అయిన మొక్కజొన్న పంట ఉత్పత్తికి  ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నది.

ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో  తూర్పు భారతంలోని  కొన్ని రాష్ట్రాలలో  మొక్కజొన్న సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.  అంతే స్థాయిలో సోయాబీన్, ఉలవలు,  రాగి, జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల దిగుబడి తగ్గింది. కారణం ఏంటంటే  ఆ పంటల సాగు భూమిని మొక్కజొన్న సాగు కోసం మళ్లించడమే.

ఇథనాల్ తయారీకి ప్రధాన ముడి పదార్థాలు చెరకు, మొక్కజొన్న వినియోగిస్తున్నందున అందుకు అనుగుణంగా ఈ ముడిపదార్ధాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో 2022 నుంచి 2025 వరకు మొక్కజొన్న సాగు 10.74 నుంచి 14.41 మిలియన్ హెక్టార్లకు పెరిగింది.  అయితే  మొక్కజొన్న  సాగుకోసం సోయాబీన్, రాగి, జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు   రికార్డు స్థాయిలో తగ్గింది. ఇది ఆహార పంటల సాగు, ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.

నీతి ఆయోగ్ రిపోర్టుల ప్రకారం  2047 నాటికి దేశానికి 49-నుంచి 57 మిలియన్ టన్నుల పప్పులు, 31నుంచి-33 మిలియన్ టన్నుల వంట నూనె అవసరమవుతుందని అంచనా వేసింది. కానీ ఉత్పత్తి తక్కువగానే ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు అదే సంస్థ 86 నుంచి -109 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవసరమని కూడా చెబుతున్నది.  అంటే భూమిని మొక్కజొన్నకా లేక నూనెగింజలకు కేటాయించాలా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.

బియ్యం అమ్మకంపై అనేక ప్రశ్నలు
2026 జులైలో రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో  గతేడాది 6.35 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఇథనాల్ డిస్టిలరీలకు (డిస్టిలరీలు అంటే లిక్కర్ తయారీ కంపెనీలు. వీటినుంచి ఆల్కహాల్ తయారుచేస్తారు) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ) విక్రయించిందని ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. అయితే సేకరించిన ఖర్చు కంటే తక్కువ ధరకు డిస్టిల్లరీలకు బియ్యాన్ని అమ్మకానికి పెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2025లో బియ్యం సేకరణకు మొత్తం 24వేల 700 కోట్లు ఖర్చు చేయగా, సేకరించిన బియ్యాన్ని కేవలం 14వేల 597 కోట్లకు డిస్టిల్లరీలకు అప్పజెప్పింది.  అంటే ఒక్క ఏడాదిలో  ప్రభుత్వ నిల్వల నుంచి ప్రైవేట్ డిస్టిల్లరీలకు సుమారు రూ.10వేల కోట్ల బదిలీ జరిగినది.

ఎవరికి లాభం.. ఎవరికి నష్టం
ఇథనాల్  తయారుచేస్తున్న కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున  ప్రోత్సాహకాలు ఇస్తున్నది.  ప్రతి లీటర్​కు రూ.71.86 ల హామీ ధరతో ఇథనాల్ కొనుగోలు చేస్తోంది. కానీ మొక్క జొన్న రైతుకు మాత్రం కనీస మద్దతు ధర చెల్లించడం లేదు.

మార్కెట్లో ఎమ్మెస్పీ ధర కంటే తక్కువకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. డిస్టిల్లరీ కంపెనీలకు ఇచ్చిన హామీ, రైతులకు ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నదని విమర్శలు ఉన్నాయి. 

మరో వైపు కోళ్లు, పశువుల మేతలో మొక్కజొన్న కీలకం. మొక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడంతో మేత ధరలు పెరిగి గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతున్నవి. దీనికి తోడు E20 పెట్రోల్ వాడే వాహనాల్లో మైలేజీ కొంత తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని  వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.

పప్పులు, నూనెగింజలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలి
డిస్టిల్లరీ ( లిక్కర్ తయారీ కంపెనీలు) కంపెనీల విషయాన్ని పరిశీలిస్తే మన దేశంలో ఇథనాల్ ప్లాంట్లు, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు  కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నది. ఒక నిర్ధిష్ట ధరలు ప్రకటించి రూ.71 హామీ  ధర  చెల్లించి ఇథనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేస్తున్నది. 

ఇవి దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాల కింద జరుగుతున్నవి.  అంతేకాదు బ్యాంకు గ్యారెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా ప్రభుత్వం ఉంటున్నది. 2018 నుంచి 1200కు పైగా ఆమోదిత ప్రాజెక్టులలో డిస్టిల్లరీ కంపెనీల రుణవడ్డీలో  కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించింది.

డిస్టిల్లరీ కంపెనీలకు నష్టభయం ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర, కచ్చితంగా కొనుగోలు చేసే కొనుగోలుదారుడిగా ప్రభుత్వం ఉండటంతో ఢోకా లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పంటలకు బదులు గడ్డి, పంట అవశేషాల నుంచి ఇథనాల్ తయారీపై పెట్టుబడి పెంచాలి.

అలాగే పప్పులు, నూనె గింజలకు కూడా మొక్కజొన్న స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లుగానే మొక్కజొన్నకు కొనుగోలు వ్యవస్థ ఏర్పాటు చేసి, ధాన్య నిల్వల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలి.

జంజిరాల రవి, జర్నలిస్ట్

  • ఓపెన్ ​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.